క‌విత పాద‌యాత్ర ఏమైంది?

బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత‌గా పార్టీ పెట్టుకున్న క‌ల్వకుంట్ల క‌విత‌.. పాద‌యాత్ర చేస్తాన‌ని కొన్నాళ్ల కింద‌ట ప్ర‌క‌టించారు. జిల్లాలు, గ్రామాలు, మండ‌లాల‌ను కూడా తాను చుట్టి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. అప్ప‌ట్లో కొన్ని గ్రామాల్లోనూ ఆమె యాత్ర చేశారు. నిజామాబాద్ నుంచి ప్రారంభించిన యాత్ర‌.. అక్క‌డ‌క్కడ సాగినా.. ఆ త‌ర్వాత ఆగిపోయింది. నిజానికి అప్ప‌టికి ఆమె పార్టీని ప్ర‌క‌టించ‌లేదు.

ఇక‌, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీని ప్ర‌క‌టించిన త‌ర్వాత‌. పాంచ‌జ‌న్యం పేరుతో ఐదు కీల‌క ప‌థ‌కాల‌ను క‌విత ప్ర‌కటించారు. ఇదేస‌మ‌యంలో ఆమె మ‌రోసారి.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తాన‌ని కూడా చెప్పారు. కానీ, నెల రోజులు గ‌డుస్తున్నా.. ఇప్ప‌టికీ ఈ వూసు ఎత్త‌డం లేదు. ఇదే విష‌యంపై బీఆర్ఎస్ వ‌ర్గాలు ఆరా తీస్తున్నాయి. నిజానికి ఒక ప్ర‌త్య‌ర్థి పార్టీగా ఉన్న క‌విత విష‌యంపై ఎందుకు ఆరా తీయాల‌న్న ప్ర‌శ్న వ‌స్తుంది.

అయితే.. అంత‌ర్గ‌తంగా క‌విత బీఆర్ ఎస్ నాయ‌కుల‌ను త‌న వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోనే ఆమె ఉన్నా.. జిల్లా స్థాయి నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో పాద‌యాత్ర చేస్తే.. ఈ ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని.. త‌మ పార్టీకి గండి ప‌డుతుంద‌ని బీఆర్ఎస్ అంచ‌నా వేస్తోంది. దీంతో క‌విత కంటే ముందుగానే.. కేటీఆర్ పాద‌యాత్ర ప్రారంభించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

కేటీఆర్ సైతం.. తాను పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ద‌రిమిలా.. బీఆర్ఎస్ వ‌ర్గాలు కూడా ఆయ‌న పాద‌యాత్ర కోసం వేచి చూస్తున్నాయి. కానీ.. ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. మ‌రోవైపు క‌విత పాద‌యాత్ర వ్య‌వ‌హారం కూడా రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఆమె పాద‌యాత్ర చేస్తే.. యువ‌త పెద్ద ఎత్తున ఆక‌ర్షితులవుతార‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలో క‌విత పాద‌యాత్ర ప్రారంభిస్తే.. బీఆర్ఎస్ శ్రేణుల‌ను ల‌క్ష్యంగా చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌న్న అంచ‌నా వేస్తున్న ఆపార్టీ.. క్షేత్ర‌స్థాయిలో క‌విత‌కు ఉన్న ఇమేజ్‌తోపాటు.. పాద‌యాత్ర చేస్తే.. వ‌చ్చే మేలు.. వంటి వాటిపై అంచ‌నాలు వేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. దీనిని బ‌ట్టి త‌మ రాజ‌కీయ ప్ర‌తివ్యూహాన్ని రెడీ చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.