త్రిశంకు స్వర్గంలో ఈటల..ఇంత అవమనామా ?

అవును తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీనియర్ నేత, మంత్రి ఈటల రాజేందర్ అత్యంత అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. భూకబ్జాలు, అధికార దుర్వినియోగం ముద్రవేసి ఈటల నుండి వైద్య, ఆరోగ్య శాఖలను తీసేశారు. ఆరోపణలు రావటం, విచారణకు ఆదేశించటం, చీఫ్ సెక్రటరీ, విజిలెన్స్ డీజీ వెంటనే విచారణ చేయించటం, భూకబ్జాలు నిజమే అని నిర్ధారించటం చకచక జరిగిపోయాయి. ఆ వెంటనే ఈటల నిర్వహిస్తున్న శాఖలను తీసేస్తున్నట్లు కేసీయార్ చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించారు.

అంటే ఈటల ఇపుడు శాఖలేని మంత్రన్నమాట. సమీక్షలు నిర్వహించేందుకు లేదు. మంత్రివర్గ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది సస్పెన్సుగా మిగిలిపోయింది. శాఖలేని మంత్రి కాబట్టి ఏ శాఖకు చెందిన ఉన్నతాధికారి కూడా మంత్రిని పట్టించుకోరు. ఇలా ఎన్ని రోజులుండాలో కూడా ఈటలకు అర్ధం కావటంలేదు. నిజంగా మంత్రికి ఈ పరిస్ధితి చాలా అవమానమనే చెప్పాలి. ఒకవిధంగా మంత్రి ఈటల త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లే అనుకోవాలి.

ఈటల వ్యవహారం తెలంగాణాలో ఇంతగా చర్చకు రావటానికి కారణం మంత్రి బలమైన బీసీ వర్గానికి చెందిన నేత కావటమే. రాష్ట్రంలోని బీసీ వర్గాల్లోని నేతలతో పాటు రాజకీయాలకు అతీతంగా కేసీయార్ ను వ్యతిరేకించే వారంతా ఈటలకు మద్దతుగా నిలబడ్డారు. దాంతో ఈటల విషయం రాజకీయంగా బాగా వివాదమవుతోంది. మరిలాంటి పరిస్ధితుల్లో మంత్రి పదవికి తానే రాజీనామా చేస్తారా ? లేకపోతే కేసీయార్ తో బర్తరఫ్ చేయించుకుంటారా అన్నదే తేలాలి.

ఏదేమైనా భూకబ్జాల ఆరోపణలు, నిర్ధారణపై మీడియాతో మాట్లాడిన ఈటల కాస్త సంయమనంగానే వ్యవహరించారు. ప్రభుత్వాన్ని కానీ కేసీయార్ ను కానీ ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. గడచిన ఏడేళ్ళల్లో టీఆర్ఎస్ లో మంత్రులు, ఎంఎల్ఏలుగా పనిచేసిన 72 మందిపై ఇదే విధమైన ఆరోపణలున్నట్లు బీజేపీ నేతలంటున్నారు. అలాంటిది ఎవరిపైనా చేయించని విచారణలు ఒక్క ఈటల విషయంలోనే ఎందుకు జరిగిందని కమలం నేతలు నిలదీస్తున్నారు.

విచిత్రమేమిటంటే ఇంతకన్నా పెద్ద పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపైన కేసీయార్ అసలు స్పందించనే లేదు. స్వయంగా కేసీయార్ కుటుంబంపైన కూడా ఎన్నో ఆరోపణలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి ఈటల వ్యవహారం టీఆర్ఎస్ పుట్టి ముంచుతుందా ? లేకపోతే పొగమంచు లాగ విడిపోతుందా అన్నది చూడాల్సిందే.