జనసేనాని పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై అటు సానుకూలంగానూ, ఇటు ప్రతికూలంగానూ పెద్ద ఎత్తున విశ్లేషణలు వినిపించాయి. ఇదే విషయంపై కాస్త లేటైనా… దక్షిణాది భాషా చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రకాశ్ రాజ్ తాజాగా సంచలన కామెంట్లు చేశారు. సీఎంగా పవన్ అనే మాట అసలు జరిగేదే కాదంటూ ప్రకాశ్ రాజ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశారు. సీఎంగా పవన్ కు ఛాన్సే లేదన్న ప్రకాశ్ రాజ్… ఈ ప్రతిపాదనను తీసుకువచ్చిన బీజేపీపై ప్రకాశ్ రాజ్ నిప్పులు చెరిగారు.
ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు సీఎంను ఎన్నుకుంటారు కదా అంటూ ప్రస్తావించిన ప్రకాశ్ రాజ్… ఎవరో, ఎవరినో సీఎం చేస్తామంటూ ప్రకటించడం ఏమిటని తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి ప్రతిపాదనల్లో అసలు సీరియస్ నెస్సే కనిపించదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. పవన్ ను బీజేపీ నేతలు సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించడాన్ని సీరియస్ గా తీసుకోవద్దని కూడా ప్రకాశ్ రాజ్ సలహా ఇచ్చారు. బీజేపీ ప్రకటనను చూస్తుంటే… ఏదో పవన్ కు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ లా కనిపిస్తోందని కూడా ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా పవన్ కల్యాణ్ బయటకు రారని, వచ్చినా పనిచేయలేరని కూడా ప్రకాశ్ రాజ్ మరింత ఘాటు కామెంట్లు చేశారు.
ఇక పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ వైఖరిపైనా ప్రకాశ్ రాజ్ ఘాటు విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు పనిచేయడం లేదన్న మాటను సూటిగానే చెప్పిన ప్రకాశ్ రాజ్… పని చేయాల్సిన బీజేపీ నేతలు ఆ దిశగా అడుగులు వేయడం లేదని, అలాంటప్పుడు పవన్ ను సీఎం అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారంటూ తనదైన శైలిలో సూటిగానే ప్రశ్నించారు.
ఇక దేశవ్యాప్తంగా ఒకే ఫార్మూలా తీసుకొస్తామంటూ చెబుతున్న బీజేపీ వైఖరిపైనా ప్రకాశ్ రాజ్ నిప్పులు చెరిగారు. తెలంగాణలోనో, ఏపీలోనో ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి కావాలో… ఉత్తరాదిలో కూర్చున్న బీజేపీ ఎలా చెబుతుందని కూడా ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపైనా ప్రకాశ్ రాజ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని, నష్టాలు వస్తున్నాయని ప్రభుత్వ రంగంలోని సంస్థలను విక్రయిస్తామని చెప్పడం కరెక్ట్ కాదని కూడా ఆయన తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates