‘ఏపీ క‌న్నా ఎక్క‌వ అప్పులు చేస్తున్నామా?’

‘అప్పు చేసి ప‌ప్పుకూడు!’ అనే సామెత‌.. ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానానికి అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతుంద‌ని అంటున్నారు మేధావులు. ‘అప్పులు పెరుగుతున్నాయి. దేశంలోనే ఎక్కువ‌గా అప్పులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. ఇది మున్ముందు మంచి ప‌రిణామం కాదు. పెట్టుబ‌డులు పెట్టేవారు కూడా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని లెక్క చూసుకుంటారు. ఇలా చేసే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు వంటి రాష్ట్రాలు ఇబ్బందులు ప‌డుతున్నాయి’- అని ఇలా ఎవ‌రైనా.. అంటే.. ‘మీరు టీడీపీ నేత‌లు… జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఉన్న ప్ర‌జాద‌ర‌ణ చూసి మీకు క‌న్నుకుడుతోంది.. అందుకే ఇలాంటి బోడి స‌ల‌హాలు ఇస్తున్నారు’ అంటూ.. వైసీపీ మంత్రుల నుంచి నేత‌ల వ‌ర‌కు తిట్ట‌దండ‌కాలు వ‌ల్లెవేస్తున్నారు.

కానీ, ఇది వాస్త‌వ‌మేన‌ని అంటున్నారు మేధావులు. దేశంలో ఎక్క‌డ ఆర్థిక ప‌రిస్థితి గురించి చ‌ర్చించినా.. ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మైనా.. అప్పు కోసం కేంద్ర ద‌గ్గ‌ర‌కు వెళ్తే.. మీరు ఎక్కువ అప్పులు చేస్తున్నారు! అని ఎవ‌రైనా అంటే.. ‘ఆ.. ఏపీ క‌న్నానా?!’ అనే ప్ర‌శ్న అడుగుతున్నారు. అంటే.. అప్పుల విష‌యంలో ఏపీని ఎంత ఆద‌ర్శంగా తీసుకుని.. జాతీయ‌స్థాయిలో ప‌రువు తీస్తున్నారో.. అర్ధ‌మ‌వుతోంది. పోనీ.. ఇలా అప్పులు తెస్తున్న సొమ్ము ఏమైనా.. పెట్టుబ‌డులు పెట్టి మ‌నీ జ‌న‌రేట్ చేస్తున్నారా? అంటే.. అది కూడా లేదు. పైగా పంప‌కాలు పెరిగిపోతూనే ఉన్నాయి.

“ఇది సంక్షేమ ప్ర‌భుత్వం. పార్టీలు చూడ‌దు.. మ‌తాలు చూడ‌దు.. కులాల‌ను అంత‌క‌న్నా చూడ‌దు”- వైసీపీ నేత‌లు చెబుతున్నారు. అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రెండేళ్లే గ‌డిచినా.. తాము అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని.. అదే స‌మ‌యంలో నిధులు పంచుతున్నామ‌ని అంటున్నారు. ఇక, ఇటీవ‌ల రెండు రోజుల కింద‌ట కూడా ‘జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌’ కింద 671 కోట్ల‌ను జ‌గ‌న్ విడుద‌ల చేశారు. ఇక‌, రైతుల‌కు సున్నావ‌డ్డీ ప‌థ‌కం కింద కూడా 168 కోట్ల రూపాయ‌ల‌ను ఆయ‌న ఇచ్చారు. స‌రే! ఇవ‌న్నీ.. ఇస్తున్నారు. దీనికి అంతిమ ల‌క్ష్యం ఏంటి? అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సంపూర్ణ మెజారిటీ. మ‌రిన్ని సీట్ల‌లో మ‌రింత విజ‌యం ద‌క్కించుకోవ‌డమే.

అయితే.. ఇప్పుడు ఇదే విష‌యంపై మేధావులు దృష్టి పెట్టారు. ‘ప్ర‌జ‌లు తీసుకుంటున్నారు. మంచిదే. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మాత్రం ఇదే ప‌రిస్థితి.. డ‌బ్బులు ఇచ్చార‌నే సింప‌తీ ఉంటుంద‌ని చెప్ప‌లేం’ అని కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. అంతేకాదు.. ప్ర‌స్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ప‌డుతోందో.. మ‌ధ్య‌త‌ర‌గతి వ‌ర్గాలు గ‌మ‌నిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వీరి శాత‌మే పెరుగుతుంది. అదేస‌మ‌యంలో యువ‌త కూడా గ‌మ‌నిస్తున్నారు. వీరు ప‌థ‌కాలు పెట్ట‌డానికి వ్య‌తిరేకులు కాక‌పోయినా.. నిధులు పంచుతున్న వైనం, రాష్ట్రం అప్పుల ఊబిలోకి చేరుతున్న వైనాల‌పై మాత్రం నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. దీంతో ఈ ప‌రిణామం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం మాత్రం ఈ పంపకాల‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది. అదేస‌మ‌యంలో పేదల్లోనూ ఈ విష‌యం చ‌ర్చ‌గానే ఉంది. పైకి అంద‌రికీ అందుతున్న‌ట్టు ప్ర‌చారం చేస్తున్నా.. లోలోన మాత్రం.. చాలా మంది ల‌బ్ధిదారుల‌కు మేలు జ‌ర‌గ‌డం లేదు. దీంతో వారంతా కూడా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకం అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అంటే.. స‌ర్కారు ఆలోచిస్తున్న‌.. పంప‌కాల‌తో పాల‌న చేద్దాం.. అంటే.. కుద‌ర‌ద‌ని నొక్కి చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ‘ప‌సుపు-కుంకుమ’ కింద… చంద్ర‌బాబు స‌ర్కారు.. మ‌హిళ‌ల‌కు పంచారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబుకు ఫ‌లితం ద‌క్క‌లేద‌ని ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా వివ‌రిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. మేధావుల ఆలోచ‌న కూడా స‌రైంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.