స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత.. టీడీపీలో ఒక చిత్రమైన విషయం హల్‌చల్‌చేస్తోంది. వైసీపీలోనేమో.. ఇంకేముంది.. టీడీపీ ఖాళీ అయిపోతుంది.. అందరూ వచ్చి తమ పార్టీలో చేరిపోతున్నారు.. దీంతో టీడీపీ ఖాళీ అయిపోతుంది..! అని ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఈ విషయంలో వైసీపీ చెబుతున్న, లేదా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు.. పక్కన పెడితే.. టీడీపీలోనే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. గతంలో ఉన్న దూకుడు మాత్రం ఉండే అవకాశం లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ దూకుడు ఎక్కువగా ఉంది.
స్థానిక ఎన్నికల్లోనూ.. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ వన్‌సైడ్‌గా విజయం సాధించిన దరిమిలా… అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి పెత్తనమే ఎక్కువగా ఉంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలకు వాయిస్ ఉండడం లేదు. నిజానికి తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా కూడా చాలా మంది నాయకులు ముందుకు రాలేదు. చంద్రబాబు మౌఖిక ఆదేశాలు ఇచ్చినా.. కూడా నేతలు ముందుకు రాలేదు. పైగా.. ఎవరూ పార్టీ గురించి కూడా పట్టించుకోవడం లేదు. అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పోనీ.. దూకుడుగా ముందుకు వచ్చినప్పటికీ.. అధికార పార్టీ నేతల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయి. అదే సమయంలో ఏదో కారణంతో కేసు నమోదు చేస్తున్నారు.
పోనీ.. ఈ సమయంలో అయినా.. నేతలకు పార్టీ అండగా నిలుస్తోందా? అంటే.. అది కూడా లేదు. ఇటీవల దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సన్నిహితులు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం పోరాడుతున్నాం.. కేసులు పెడుతున్నారు.. పార్టీ కనీసం బెయిల్ ఇప్పించే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. దీంతో మౌనంగా ఉంటే పోలా.. అని అనుకుంటున్నాం. అని వారు చెప్పారు.
ఇక, ఇదే పరిస్థితి గెలిచిన నాయకులకు కూడా ఉంది. వారు వ్యాపారాలు, వ్యవహారాల్లో తలమునకలైన నేపథ్యంలో గళం విప్పితే.. తంటాలు వస్తాయని భావించి.. మౌనంగానే ఉండిపోతున్నారు. సో.. ఈ పరిస్థితి తిరుపతి రిజల్ట్ తర్వాత.. మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ పరిస్థితిని తట్టుకుని.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.