టీడీపీ నేతల వ్యవహారంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర మనస్థాపంతో ఉన్నారా ? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ? అని ఆయన తర్జన భర్జన పడుతున్నారా ? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది.. టీడీపీ వర్గాల నుంచి. మరి దీనికి విరుగుడు ఏంటి ? ఏం చేస్తే.. పార్టీ పరిస్థితి చక్కబడుతుంది ? అనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెల రోజుల పాటు ఆయన పార్టీకి, రాష్ట్రానికి కూడా దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్టు సమాచారం. పైగా.. ప్రస్తుతం టీడీపీ వేవ్ కూడా అంత బాగాలేదు. స్థానిక ఎన్నికల్లో ఓటమి, కార్పొరేషన్ ఎన్నికల్లో పరాభవంతో పరిషత్ ఎన్నికలను బహిష్కరించారు. ఇక, తిరుపతిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. ఇక్కడ కూడా తమ్ముళ్లు కలిసిరాలేదనేది వాస్తవం. ఇక్కడ ఫలితం ఎలాగూ వ్యతిరేకంగా ఉండబోతోందని ముందే డిసైడ్ అయ్యింది.
పైగా ఓ వర్గం నేతలు.. మాజీ మంత్రి, తన తనయుడు లోకేష్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోనీ.. ఇలాంటి వారిని పిలిచి వార్నింగ్ ఇద్దామా ? పార్టీని లైన్‌లో పెడదామా ? అంటే… అంతా సీనియర్లు, కీలకమైన పదవుల్లో ఉన్నవారు. దీంతో ఎవరినీ ఏమీ అనలేని నిస్సహాయతలో చంద్రబాబు ఉన్నారు. దీంతో తనే కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు, నేతలకు దూరంగా ఉంటే బెటర్ అని బాబు తలపోస్తున్నట్టు సమాచారం. ఇప్పట్లో రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలూ లేవు. పైగా తాను కూడా రిలాక్స్ కావాలని భావిస్తున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోవడం కాకుండా.. లోకేష్‌కే పూర్తిస్థాయిలో పగ్గాలు ఇచ్చేసి వెళ్తే.. ఈ నెల రోజుల్లో ఆయన ఎలా నడిపిస్తాడో కూడా ఓ ప్రయోగంగా ఉంటుందని బాబు భావిస్తున్నారు.
త్వరలోనే చంద్రబాబు అమెరికా లేదా దుబాయ్ వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు టీడీపీ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. ఏ దేశానికి వెళ్లినా.. అక్కడి ఎన్నారైలతో ఆయన భేటీ అయి.. పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టనున్నారని అంటున్నారు. ప్రస్తుతం అమెరికా వైపే బాబు మొగ్గు చూపుతున్నారని.. అక్కడ అత్యంత కీలకమైన తానా ఎన్నికలు జరుగుతున్నందున.. తాను కూడా ఇంటర్నల్‌గా ప్రచారం చేస్తే.. తానా మద్దతు తనకు ఉంటుందని.. ఆయన భావిస్తున్నారు. అయితే.. ఎప్పుడు వెళ్తున్నారు? ఏంటి? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మే 2న తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలకు ముందుగానే ఆయన వెళ్తారని తెలుస్తోంది. మరి లోకేష్‌కే పగ్గాలు అప్పగిస్తున్న నేపథ్యంలో పార్టీలో ఏమైనా సంచలనాలు చోటు చేసుకుంటాయా? లేదా? అనేది కూడా ఆసక్తిగా మారింది.