తమ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తికి బంపర్ మెజారిటి వస్తుందని వైసీపీ నేతలు చాలా నమ్మకంతో ఉన్నారు. అధికారపార్టీ నేతల నమ్మకానికి తగిన కారణాలు ఉన్నాయి. అదేమిటంటే లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో ఒక్క తిరుపతిలో మాత్రమే చాలా తక్కువగా అంటే 50 శాతం ఓటింగ్ జరిగింది. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో శ్రీకాళహస్తి, వెంకటగిరి, సర్వేపల్లి ఓపెన్ క్యాటగిరి నియోజకవర్గాలు. సత్యవేడు, సూళ్ళూరుపేట, గూడూరు రిజర్వుడు నియోజకవర్గాలు.
ఓసీ నియోజకవర్గాల్లో సగటు ఓటింగ్ 69 శాతం నమోదైంది. ఇదే సమయంలో రిజర్వుడు నియోజకవర్గాల్లో సగుటు ఓటింగ్ 71గా నమోదైంది. ఎస్సీ నియోజకవర్గాల్లో భారీగా నమోదైన ఓటింగ్ వల్లే తమ అభ్యర్ధి మంచి మెజారిటి గెలవబోతున్నట్లు వైసీపీ నేతలు చాలా ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో వెంకటగిరి, శ్రీకాళహస్తి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో కూడా తమకు ఏకపక్షంగా ఓటింగ్ జరిగినట్లు వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
2019 ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాల్లోనే వైసీపీకి సుమారు 1.5 లక్షల ఓట్ల మెజారిటి వచ్చింది. కాబట్టి అదే పద్దతిలో ఇపుడు కూడా ఈ మూడు నియోజకవర్గాల్లోనే సుమారు 2 లక్షల మెజారిటి అంచనా వేస్తున్నారు. వివిధ కారణాల వల్ల తిరుపతి అసెంబ్లీపై మొదటినుండి వైసీపీ నేతల అంచనాలు కాస్త అయోమయంగానే ఉంది. 2019 ఎన్నికల్లో కూడా తిరుపతిలో వైసీపీ 3500 ఓట్లు మైనస్ వచ్చింది.
అయితే ఈమధ్యనే జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వైసీపీ దాదాపు స్వీప్ చేసింది. అయితే అదే మ్యాజిక్ ఇపుడు మళ్ళీ రిపీట్ అవుతుందా అన్నదే చెప్పలేకున్నారు. దానికితోడు పోలింగ్ శాతం 50కి వచ్చి ఆగిపోవటంతో అధికారపార్టీ నేతల్లో అయోమయం మరింత పెరిగిపోయింది. మొత్తానికి నేతల మాటలు చూస్తుంటే మెజారిటి నుండి తిరుపతిని మినహాయించినట్లే ఉంది. పైగా మూడు ఎస్సీ నియోజకవర్గాలపైనే బాగా హోప్స్ పెట్టుకున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates