త్వరలోనే మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయాలని భావిస్తున్న జగన్ కేబినెట్ నుంచి దిగిపోయే వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న రెండు పేర్లలో రాయలసీమ ప్రాంతానికి చెందిన కీలక మంత్రి, బీసీ వర్గానికి చెందిన నాయకుడు.. శంకరనారాయణ పేరు ఒకటి. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి తొలి సారి గెలిచిన ఈయనకు జగన్ మంత్రి పదవి ఇచ్చారు. నిజానికి ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. మరి అలాంటి నియోజకవర్గంలో ప్రజలు ఆదరించినందుకు.. పార్టీని గెలిపించినందుకు నాయకుడిగా.. ఆయన పార్టీని, నియోజకవర్గాన్ని రెండు కళ్లమాదిరిగా చూసుకోవాల్సిన అవసరంఉంది. లేకపోతే.. ఏక్షణమైనా.. ప్రజల మనసు మారే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇదే జరుగుతోంది.
నియోజకవర్గంలో శంకర్ నారాయణ మంత్రి హోదాలో ఉండి కూడా ఏమాత్రం సత్తా చూపించలేక పోతున్నారు. పోనీ.. మంత్రిగా ఉన్నప్పటికీ.. ఆయన చేస్తోంది కూడా పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడమూ లేదు. పపోనీ.. దీనికి ఏమైనా.. జగన్ అడ్డుకట్ట వేశారా? అంటే.. అదికూడా కనిపించడం లేదు. ఇతర మంత్రులు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. కానీ, శంకరనారాయణ మాత్రం ఇటు నియోజకవర్గాన్ని, అటు మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ముఖ్యంగా గత ఎన్నికల్లో ఇక్కడి రైతులకు సాగు నీరు తెప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ ఊసు ఎత్తడం లేదు. పైగా టీడీపీ నేతల దూకుడుకు కూడా ఆయన అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. అత్యంత కీలకమైన విషయంలో కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో.. అసలు తన నియోజవకర్గంలోకి అడుగు పెట్టేందుకు కూడా మంత్రి భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నియోజకవర్గంలో కేడర్ అయితే ఆయనకు మళ్లీ సీటు ఇస్తే ఓడిస్తామని ఓపెన్‌గానే శపథాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయనను తప్పించడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. మరోవైపు.. టీడీపీ నేతలు, ముఖ్యంగా పరిటాల వర్గం ఇక్కడ పుంజుకొంటోంది. ఈ క్రమంలో అన్ని పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వైసీపీ అధిష్టానం.. ఈయనను తప్పించడంతోపాటు.. వచ్చే ఎన్నికల్లో కొత్తవారికి ఇక్కడ అవకాశం ఇచ్చేలా ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందోచూడాలి.