ఫోన్ కు దొరకని ప్రధానమంత్రి

అవును ఓ ముఖ్యమంత్రి అర్జంటుగా మాట్లాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోడికి ఫోన్ చేస్తే మాట్లాడేందుకు నిరాకరించారట. ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు మహారాష్ట్ర వణికిపోతున్న విషయం చెబుదామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఎంత ప్రయత్నించినా మోడి మాత్రం మాట్లాడేందుకు ఇష్టపడలేదు. థాక్రే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రధానమంత్రి బిజీబిజీ అని సిబ్బంది చెప్పారట. దాంతో తనతో మాట్లాడటం మోడికి ఇష్టంలేదని సీఎంకు అర్ధమైపోయిందట.

ఇదే విషయాన్ని థాక్రే బయటపెట్టడంతో పెద్ద సంచలనంగా మారింది. మొదటినుండి కూడా బీజేపీయేతర రాష్ట్రాలంటే కేంద్రం నిర్లక్ష్యంగానే ఉంది. ఒకవైపు కరోనా వైరస్ విజృంభిస్తున్నా కేంద్రం తరపున ఇవ్వాల్సినంత మద్దతు ఇవ్వటం లేదనే ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగిపోతున్నా, వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిన వారిసంఖ్య పెరిగిపోతున్న కేంద్రంనుండి మాత్రం సరైన ప్రోత్సాహంలేదు.

ప్రస్తుతం కరోనా వైరస్ కొరత మహారాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బకొడుతోంది. దేశం మొత్తంమీద అత్యధిక కేసులు, మరణాలు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఇందుకనే కోవిడ్ వ్యాక్సిన్, రెమ్ డెసివిర్ చాలా అవసరమని సీఎం ఎంత మొత్తుకుంటున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని థాక్రే పెద్ద బాంబు పేల్చారు. తాను మాట్లాడేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రధానమంత్రి చాలా బిజీబిజీగా ఉన్నారని వ్యక్తిగత సిబ్బంది బదులిచ్చినట్లు చెప్పారు.

ఓ సీఎంతో మాట్లాడలేనంత బిజీగా ప్రధానమంత్రి ఏమి చేస్తున్నారయ్యా అంటే బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇదే విషయమై సీఎం మాట్లాడుతు ప్రజల ప్రాణాలకు సంబందించిన విషయం కన్నా ప్రధానికి పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారమే ఎక్కువైపోయిందంటు మండిపోయారు. మహరాష్ట్రకు రెమ్ డెసివిర్ సరఫరా ఇవ్వద్దని మోడి కంపెనీలకు చెప్పినట్లు థాక్రే ఆరోపించారు. రాష్ట్రంలో ఆక్సిజన్, కోవిడ్ టీకాలకు తీవ్రమైన కొరతుందంటు మొత్తుకున్నారు. మొత్తానికి బీజేపీయేతర రాష్ట్రాల విషయంలో కరోనా వైరస్ విషయంలో కూడా మోడి ఎలా వ్యవహరిస్తున్నారనేందుకు ఇదే తాజా ఉదాహరణగా నిలిచింది.