సాయిరెడ్డి ఏమ‌య్యారు? ఎక్క‌డున్నారు?


వైసీపీ కీల‌క నాయ‌కుడు.. రాజ్య‌స‌భ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి ఏమ‌య్యారు ? ఎప్పుడూ.. త‌న ట్వీట్ట‌ర్ ప‌లుకుల ద్వారా రాజ‌కీయాల‌ను వేడెక్కించే ఆయ‌న ఇటీవ‌ల ముగిసిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. మ‌టు మాయం కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వానికి విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీని గెలుపు గుర్రం ఎక్కించేందుకు నానా యాత‌న ప‌డ్డ ఆయ‌న అనుకున్న‌ది సాధించారు. అయితే.. భారీ మెజారిటీద‌క్కించుకోలేక పోయినా.. కార్పొరేష‌న్ వైసీపీ ప‌రం అయ్యేలా మాత్రం ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. అయితే ఈ గెలుపును జ‌గ‌న్ మాత్రం మెచ్చ‌లేద‌ని వైసీపీ వ‌ర్గాల్లోనే టాక్ న‌డిచింది.

దీంతో వెంట‌నే వ‌చ్చిన తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లోనూ స‌త్తా చాటుతార‌ని.. ఆయ‌న ఊపుతో వైసీపీ లో మంచి జోష్ వ‌స్తుంద‌ని.. టీడీపీకి కౌంట‌ర్లుకూడా ఇస్తార‌ని అనుకున్నారు. అయితే.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌కు సంబంధించి ఎక్క‌డా సాయిరెడ్డి ఒక్క మాట కూడా అన‌లేదు. క‌నీసం ట్వీట్ కూడా చేయ‌లేదు. సీఎం ఇలా అన్నారు.. అలా అన్నారు అని కానీ.. భారీ మెజారిటీ వ‌స్తుంద‌ని కాని.. ఆయ‌న కామెంట్లు చేయ‌లేదు. పైగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న‌పై రాళ్ల దాడి జ‌రిగింద‌ని అన్న‌ప్పుడు కానీ.. లోకేష్‌.. వైఎస్ వివేకా హ‌త్య కేసును అడ్డు పెట్టి ప్ర‌తిజ్ఞ‌లు చేయ‌డం పై కానీ.. సాయిరెడ్డి చూచాయ‌గా కూడా స్పందించ‌లేదు.

తిరుప‌తిలో అంతా వైవి. సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి హ‌డావిడే క‌నిపించింది. దీంతో సాయిరెడ్డి ఎక్క‌డున్నారు ? అస‌లు ఏపీలో లేరా ? అనే సందేహాలు తెర‌మీద‌కి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్‌లో ఉన్న‌ట్టు వైసీపీలో టాక్ న‌డుస్తోంది. అయితే.. ఆయ‌న ఎక్క‌డ ఉన్న‌ప్ప‌టికీ.. ట్వీట్ చేయొచ్చుక‌దా ? ట్విట్ట‌ర్‌లో అయితే యాక్టివ్‌గానే ఉంటారు క‌దా ? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతాయి. అయితే.. కొన్ని కొన్ని సార్లు సాయిరెడ్డి చేస్తున్న ట్వీట్లు.. విక‌టించి.. వైసీపీ ఇబ్బందుల్లో ప‌డుతోంది.

ఈ నేప‌థ్యంలో తిరుప‌తి విష‌యంలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని.. జ‌గ‌నే స్వ‌యంగా ఆయ‌న‌కు సూచించి ఉంటార‌ని.. అందుకే ఆయ‌న మౌనంగా ఉన్నార‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఏదేమైనా.. తిరుప‌తి వంటి కీల‌క ఎన్నిక స‌మ‌యంలో సాయిరెడ్డి ఊసు లేకుండా పోవ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారడం విశేషం.