అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలోనూ ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సీనే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ భారీ రేంజ్లో ఉంటుందని భావించినప్పటికీ.. ఆశించిన విధంగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు రాకపోవడం తెలిసిందే. దీంతో స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో 80శాతం పోలింగ్ నమోదైతే… పరిషత్‌లో ఇది భారీగా తగ్గిపోయింది. ఇక, ఇప్పుడు తిరుపతిలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది.
తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు కూడా వైసీపీ నేతల చేతుల్లో ఉన్నాయి. ఈ ఏడు చోట్ల కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతుందని.. బ్యాలెట్ బాక్సులు నిండిపోవడం ఖాయమని అనుకున్నారు. అయితే.. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. ఉదయం 11 గంటల సమయానికి కేవలం 18శాతమే నమోదు కావడం గమనార్హం. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. గూడూరులోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే.. ఉదయం పది గంటల వరకు పది ఓట్లు కూడా నమోదుకాని పరిస్థితి ఉంది.
ఇక, శ్రీకాళహస్తిలో ఉదయం 10 గంటల సమయానికి కేవలం 5 శాతం ఓట్లు పడ్డాయి. తిరుపతిలో మాత్రం ఒకింత ఫర్వాలేదు.. అన్నట్టుగా ఉదయం 10 గంటలకు 15 శాతం పోలింగ్ నమోదైనా.. తర్వాత మళ్లీ మందగించింది. ఇలా.. మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ ఓటర్లు పోలింగ్ బూతులకు రాలేదనేది వాస్తవం. మరి దీనికి కారణం ఏంటి?
- ఎండలు ఎక్కువగా ఉండడం
- కరోనా భయం ప్రజల్లో పెరిగిపోవడం.. ఈ విషయంలో ఓటర్లను భయానికి గురి కాకుండా చేసుకోవడంలో పార్టీలు విఫలం కావడం.
- ఉప ఎన్నికే కదా.. ఎందుకులే అనే నిర్లిప్తత ఓటర్లలో పెరిగిపోవడం
- మరో అత్యంత కీలక విషయం.. ఓటర్లకు డబ్బులు పంచకపోవడం.
- పరిషత్ ఎన్నికల్లోనూ పోలింగ్ పడిపోవడానికి ఓటర్లకు డబ్బులు పంచకపోవడమే ప్రధానమని విశ్లేషకులు భావించారు.
- ఇప్పుడు తిరుపతి పార్లమెంటు పరిధిలోనూ అనేక మంది పార్టీల నుంచి ప్రచారం చేశారే తప్ప.. ఓటర్లకు ఎక్కడాఎవరూ డబ్బులు పంచలేదు.
- అయితే.. రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్‌కు అవకాశం ఉన్న నేపథ్యంలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వస్తుండడం గమనార్హం.