రాజు కోరుకుంటే కొండమీద కోతైనా రావాల్సిందే అనేది సామెత. ఇపుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో అదే జరిగినట్లుంది. ఈనెల 3వ తేదీనుండి పవన్ కు అనారోగ్యంగా ఉన్న విషయం తెలిసిందే. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో రోడ్డుషో, బహిరంగసభ తర్వాత పవన్ బయట ఎక్కడా కనబడలేదు. తర్వాత విషయం తెలిసిందేమంటే క్వారంటైన్లోకి వెళ్ళిపోయారని.
పవన్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారనగానే అందరికీ అనుమానం వచ్చేసింది. అయితే విషయాన్ని ఎవరు అదికారికంగా చెప్పలేదు. కానీ తాజాగా పవన్ కు కరోనా వైరస్ సోకిందని స్వయంగా జనసేన అధికారికంగా ప్రకటించింది. తన వ్యవసాయక్షేత్రంలోనే అవసరమైన చికిత్స చేయించుకుంటున్నట్లు కూడా ప్రెస్ నోట్లో స్పష్టంగా చెప్పారు. అలాగే చికిత్స చేయించుకుంటున్న ఫొటోను కూడా విడుదలచేశారు. ఆ ఫొటోలో పవన్ కు ఆక్సిజన్ ట్యూబ్ పెట్టినట్లు స్పష్టంగా కనబడుతోంది.
మామూలుగా అయితే కరోనా వైరస్ సోకిన వారిని వెంటనే ఆసుపత్రిలో చేరుస్తారు. కానీ పవన్ను మాత్రం ఆసుపత్రిలో చేర్చకుండా అపోలో ఆసుపత్రినే ఇంటికి తెచ్చినట్లుంది. ఎందుకంటే కరోనా సోకిందని తెలియగానే వెంటనే అపోలో వైద్యులు పవన్ ఇంటికివెళ్ళారట. వ్యవసాయక్షేత్రంలోనే తాత్కాలికంగా ప్రత్యేక ఐసీయుని ఏర్పాటు చేశారట. అపోలో ఆసుపత్రి వైద్యులు, మెడికల్ బృందం నిరంతరం పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఎలాగూ అపోలో యాజమాన్యం అల్లుడన్న విషయం తెలిసిందే. అపోలో ఛైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మనవరాలు ఉపాసనను రామ్ చరణ్ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి పవన్ను ఆసుపత్రికి తరలించే బదులు అపోలోనే పవన్ వ్యవసాయక్షేత్రానికి తరలించినట్లున్నారు. అందుకనే ఫొటోలో ఆసుపత్రి బెడ్, అటెండెండ్ బెడ్ లాంటవన్నీ కనబడుతున్నాయి. ఏమైనా రాజు తలచుకుంటే దేనికి కొదవ ?
Gulte Telugu Telugu Political and Movie News Updates