అచ్చెన్న‌ వీడియో లీక్: టీడీపీ పని అయిపోయిందా..

తిరుప‌తి పార్ల‌మెంటుకు ఉప ఎన్నిక జ‌రుగుతున్న నేప‌థ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్లు సంచ‌ల‌నంగా మారాయి. టీడీపీని గాడిలో పెట్టేందుకు పార్టీ అధినేత చంద్ర‌బాబు ఒక‌వైపు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు.. పార్టీ ప‌రిస్థితి ఏమీలేద‌ని.. వ‌చ్చే 17 త‌ర్వాత పార్టీ ప‌ని అయిపోయిన‌ట్టేన‌ని.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఓ హోటల్‌లో టిఫిన్ చేస్తున్న స‌మ‌యంలో అచ్చెన్న చేసిన కామెంట్లు స్టింగ్ ఆప‌రేష‌న్ రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ప‌క్క‌నే ఓ సీనియ‌ర్ నాయ‌కుడు.. “ముప్పై ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నామ‌ని.. కానీ, రాజ‌గోపాల్ స‌హా ఎవ‌రూ ఫోన్ ఎత్త‌డం లేద‌ని, ఇలా అయితే.. ఎలా ?” అని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఈ సంద‌ర్భంగా టిఫిన్ చేస్తూనే మాట్లాడిన అచ్చెన్న‌.. “17 త‌ర్వాత‌.. పార్టీ లేదు.. బొక్కాలేదు” అనేశారు. అప్ప‌టి వ‌ర‌కు ఓపిక ప‌ట్టండి! అని సూచించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. పార్టీని తాము గ‌ట్టిగా ప‌ట్టుకుని నిల‌బెడుతున్నామ‌ని.. లేక పోతే.. ఇంత మాత్రం కూడా ఉండ‌ద‌ని అచ్చెన్న చేసిన కామెంట్లు సంచ‌ల‌నంగా మారాయి.

ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌ల స్టింగ్ వీడియో.. సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుండడం గ‌మ‌నార్హం. అయితే.. ఈ స్టింగ్‌పై అచ్చెన్న రియాక్ట్ అయ్యారు. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు లోకేష్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ ఆప‌రేష‌న్లు విడ‌దీయ‌లేవని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో జగన్‌కు ఓట‌మి భ‌యం పట్టుకుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. త‌న సంభాష‌ణ‌ల్ని వ‌క్రీక‌రించార‌ని, దీని వెనుక జ‌గ‌న్ హ‌స్తం ఉంద‌ని అచ్చెన్నాయుడు ఆరోపించారు. “నువ్వూ, నీ దొంగ సాక్షి ఎన్ని త‌ప్పుడు‌ వీడియోలు వేసినా టీడీపీలో విభేదాలు సృష్టించ‌లేవు” అని జ‌గ‌న్ పై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మొత్తానికి ఈ స్టింగ్ ఆప‌రేష‌న్ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.