ఓట్లు కావాలి-సీట్లు కావాలి.. తమదే పైచేయి అని చెప్పుకోవాలి! ఇదే సూత్రంగా ఎన్నికలకు వెళ్తున్న వైసీపీ నాయకులు, ముఖ్యంగా పార్టీ అదిష్టానం.. సీఎం జగన్.. ప్రజలకు అనుకూలంగా ముఖ్యంగా ఓటర్లకు అను కూలంగా వ్యవహరిస్తున్నారా? అంటే.. లేదనే చెప్పాలి. జగన్ నిర్వాకంతో.. ఓటర్లు.. పోలీసుల లాఠీ దెబ్బలు తింటున్నారు. ఓటు వేయాలని పదే పదే ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు.. మరి ఓటర్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలోను, వారికి అనుకూలంగా వ్యవహరించడంలోనూ పూర్తిగా విఫలమవుతు న్నారు. దీంతో ఓటర్లు.. బిక్కచచ్చిపోతున్న పరిస్థితి శ్రీకాకుళంలో కనిపిస్తోంది.
ఏపీ-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని కొఠియా గ్రూపు గ్రామాలుగా పిలవబడే గిరిజన తండాల్లో ఒడిశా పోలీసులు నిన్న ఉదయం నుంచి భారీ ఎత్తున మోహరించారు. ఇక్కడి గిరిజనులను ఓట్లు వేయడానికి వీల్లేదంటూ.. అడ్డుకుంటున్నారు.ఇక్కడ మొత్తం 1760 ఓట్లు ఉన్నాయి. అయితే.. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయానికి కేవలం 8 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీనిని బట్టి ఒడిశా బలగాలు ఏం రేంజ్లో విరుచుకుపడి.. ఇక్కడి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. దీనికి కారణం.. ఏంటి? ఎందుకు మన రాష్ట్ర సరిహద్దులో ఒడిశా దూకుడు ప్రదర్శిస్తోంది? అనే ప్రశ్నలు ఆసక్తిగా మారాయి.
కొఠియా గ్రామాలను తమ పరిధిలో చేర్చుకున్న ఒడిశా.. ఈ గ్రామాల ప్రజలు కూడా తమ పౌరులేనని వాదిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలను కూడా నిర్బంధించేందుకు ప్రయత్నించింది. అయితే.. ఈ క్రమంలో ఒడిశానే సుప్రీంకోర్టు కు వెళ్లగా.. ఎన్నికల నిర్వహణకు సుప్రీం అడ్డు చెప్పలేదు. దీంతో ఎన్నికలు జరిగాయి. అయితే.. ఇప్పుడు మాత్రం ఒడిశా తెలివిగా వ్యవహరించి.. పరిషత్ ఎన్నికలపై కోర్టుకు వెళ్లకుండా బలప్రయోగానికి దిగింది. బుధవారం ఉదయం నుంచి భారీ ఎత్తున ఒడిశా పోలీసులు ఇక్కడ ప్రజలను నిర్బంధం .. ఇళ్లు దాటి బయటకు రాకుండా చేశారు.
ఈ విషయం ఏపీ ప్రభుత్వానికి తెలిసినా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ ఒడిశాతో సంప్రదింపులు కానీ.. మరో మార్గంలో ఓటర్లను ఓట్లు వేసుకునే స్వేచ్ఛను కల్పించడం కానీ .. చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ రణరంగంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఓట్లు వేయకుండా అడ్డుకుంటే.. ఒడిశా విజయం దక్కించుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏపీ చేతులు ఎత్తేసిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్లకు కనీస రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో విఫలం కావడంపై ప్రజాస్వామ్య వాదులు సైతం ఖిన్నులవుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates