ఆ పోలీసాయన కు జగన్ హ్యాట్సాఫ్

విశాఖలోని ఆర్ ఆర్ వెంకటాపురం దగ్గర ఉన్న ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో స్టైరీన్ గ్యాస్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గ్యాస్ లీక్ దుర్ఘటనలో 12 మంది మృత్యువాత పడగా వందలాది మంది చికిత్స పొందుతున్నారు. తెల్లవారుఝామున అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రమాదవశాత్తూ గ్యాస్ లీక్ కావడంతో చాలామంది నిద్రలోనే గ్యాస్ పీల్చేశారు.

అయితే, గ్యాస్ లీకయిన అరగంటలోనే ప్రభుత్వ యంత్రాంగా, పోలీసులు, అధికారులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ లీకయిన అరగంటలోపే ఐదు గ్రామాల ప్రజలు అప్రమత్తం కావడం వెనుక ఓ ఐపీఎస్ ఆఫీసర్ సమయస్ఫూర్తి ఉంది. విశాఖకు చెందిన ఓ ఐపీఎస్ అధికారి చూపిన చొరవతోనే దాదాపు 1000 మంది ప్రాణాలు దక్కాయి.

ఏదైనా ప్రమాదం జరిగినపుడు…దాదాపుగా చాలామంది ప్యానిక్ అవుతుంటారు. ఎంత గుండె నిబ్బరం ఉన్నవారైనా కొంత కంగారు పడతారు. ఆ కంగారులోనే ఏం చేయాలో పాలుపోక ప్రమాదానికి గురవుతుంటారు. అయితే, ఇటువంటి విపత్తుల సమయంలోనూ సమయస్ఫూర్తి చూపే వారు కొందరుంటారు. విశాఖ పట్నం జోన్-2 డీసీపీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్లా ఉదయ భాస్కర్ కూడా ఆ కోవలోకే వస్తారు.

ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రాణ నష్టం తగ్గడానికి విజయ భాస్కర్ సమయస్ఫూర్తే కారణం. గ్యాస్ లీక్ అయిన విషయం తెలుసుకున్న విజయ భాస్కర్ ఏ మాత్రం తత్తరపాటుకు లోనవకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. వెంటనే ఫ్యాక్టరీ చుట్టు పక్కల ఐదు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పెట్రోల్ వాహనాలలో పోలీసు సిబ్బందిని పంపించి గ్రామంలోని ప్రతి వీధిలో సైరన్ మెగించారు.

సైరన్ విన్న ప్రజలు అప్రమత్తమై ఇళ్లలోనుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత వారికి విషయం తెలియజెప్పి…వారందరినీ తన సిబ్బంది, పోలీసుల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు విజయ భాస్కర్. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, గ్యాస్ పీల్చిన వారిని, వృద్ధులను ఆసుపత్రికి తరలించడంలో విజయ భాస్కర్ తో పాటు, పోలీసు సిబ్బది చురుకైన పాత్ర పోషించారు.

విజయ భాస్కర్ సరైన సమయానికి స్పందించి దాదాపు 1000 మంది ప్రాణాలు కాపాడగలిగారు. లేకుంటే విశాఖ మరో భోపాల్ తరహాలో….పెను విపత్తును ఎదుర్కోవాల్సి వచ్చేది. విజయ భాస్కర్ సమయస్ఫూర్తిని, ధైర్యసాహసాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు. అంతేకాకుండా, విజయ భాస్కర్ పేరును రాష్ట్రపతి అవార్డుకు సిఫారసు చేశారు. ఆపద సమయాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన విజయ భాస్కర్ వంటి పోలీసులు మరెందరికో ఆదర్శం అనడంలో ఎటువంటి సందేహం లేదు.