ఏపీ సీఎం జగన్‌ను నారాయణమూర్తిగా అభివర్ణిస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చుకుడు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు.. వైసీపీకి ప్లస్ కన్నా మైనస్‌గానే ఎక్కువగా మారాయి. ఆ పార్టీ నేతలు.. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయలేక పోతున్నారు.. మరోవైపు.. సొంత పార్టీకి చెందిన అసమ్మతి ఎంపీ.. రఘురామకృష్ణరాజు.. ఈ వ్యాఖ్యలను దుయ్యబట్టారు. దీంతో రమణ దీక్షితులు తనకు తాను వైసీపీకి మైలేజీ ఇచ్చుకున్నానని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నా.. ఇది వర్కవుట్ కాకపోవడం గమనార్హం.
ప్రస్తుతం తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికజరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న హిందూ వర్గాన్ని శాంతింప జేసేందుకు, వైసీపీ వైపు వారి దృష్టిని మళ్లించేందుకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేస్తూ.. వంశపారంపర్య అర్చకత్వం, అర్చకులకు వయోపరిమితి వంటివాటిని ఎత్తేస్తూ.. సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఆయన అధికారంలోకి రాగానే ఈ నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు. కానీ, ఇప్పటి వరకు మౌనంగా ఉన్న జగన్.. ఇప్పుడు తిరుపతి ఉప పోరు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం .. రాజకీయంగా వివాదానికి కారణమైంది.
జగన్ రాజకీయ లబ్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు కూడా ఎక్కువుగా వస్తున్నాయి. బీజేపీ సహా టీడీపీ జగన్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో రమణ దీక్షితులు ఏకంగా సీఎంను నారాయణ మూర్తిగా పోల్చుతూ.. కొనియాడడం, నేరుగా తాడేపల్లికి వచ్చి .. సీఎం జగన్‌కు శ్రీవారి ప్రసాదాలు అందించడం వంటివి మైలేజీ తీసుకురాకపోగా.. మైనస్‌గా మారాయి.
జగన్‌పై ఇప్పటికే ఓ మతానికి చెందిన వ్యక్తిగా పేరుంది. దీనిని చెరిపివేసేందుకు వైసీపీ ఏనాడూ ప్రయత్నించలేదు. కానీ, ఇప్పుడు దీక్షితులు మాత్రం ఆయనను హిందువుగా ప్రొజెక్టు చేసేందుకు ప్రయత్నించారు. ఎన్నికల సమయంలో చేసిన ఈ ప్రయోగం.. వైసీపీకి లాభిస్తుందని అనుకున్నా.. ఎంపీ రఘురామ చేసిన వ్యాఖ్యలు.. ప్రతిపక్షాల విమర్శలతో రమణ దీక్షితులు చేసిన ప్రయత్నం బూదిలో పోసినట్టుగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Click Here for Recommended Movies on OTT (List Updates Daily)