జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందా? ఎంపీ పిటిష‌న్‌తో హీటెక్కిన పాలిటిక్స్‌

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందా?– ఇప్పుడు ఇదే విష‌యం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అస‌మ్మ‌తి నాయ‌కుడు.. న‌ర‌సాపురం ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా.. సీఎం జ‌గ‌న్ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. హైకోర్టులో పిటిష‌న్ వేశారు. సీబీఐ కోర్టులో ఉన్న అక్ర‌మాస్తుల‌ కేసుల్లో ఏ-1గా ఉన్న సీఎం జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలని కోర్టును అభ్య‌ర్థించారు. ఇప్ప‌టికే జ‌గ‌న్‌పై 11 సీబీఐ ఛార్జిషీట్లు వేసింద‌ని పేర్కొన్నారు. ఆయా కేసుల్లో జ‌గ‌న్‌ ఏ-1గా ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇన్ని ఛార్జిషీట్లు వేసినా…విచార‌ణ‌ ఆలస్యంగా జరుగుతోందని కోర్టుకు వివ‌రించారు.

కేసుల విచారణలో జాప్యం జరుగుతున్నందున‌, ఆయన త్వరగా కేసుల నుంచి బయట‌పడాలనే ఉద్దేశంతోనే ఈ కేసు వేశానని ర‌ఘురామ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని, జయలలిత, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ తదితరులు తమ స్థానంలో వేరే వారికి సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశమిచ్చి.. కేసుల నుంచి బయటపడాలని జ‌గ‌న్‌కు సూచించారు. ఇంత వ‌ర‌కు బాగానే.. ఉన్నా.. ఇప్పుడు ఒక్క‌సారిగా.. వైసీపీలో ఈ త‌ర‌హా ప‌రిస్థితి హీటెక్కించింది. నిజానికి ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? విచార‌ణ‌కు స్వీక‌రించే అవ‌కాశం ఉందా? తీసుకుంటే.. ప‌రిస్థితి ఏంటి? వంటి విష‌యాలు.. వైసీపీ నేత‌ల మ‌ధ్య హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ నేప‌థ్యంలో.. కొన్నాళ్ల కింద‌ట హైకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌నిచేసి.. రిటైరైన జ‌స్టిజ్ రాకేష్ కుమార్ వ్యాఖ్య‌లు కూడా వైసీపీ నేత‌ల చ‌ర్చ‌ల్లో వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇన్ని చార్జిషీట్‌లు ప‌డిన‌ప్ప‌టికీ.. కేసుల విచార‌ణ ఎందుకు ఆల‌స్య‌మ‌వుతోందో.. నాకు సైతం అర్ధం కావ‌డం లేద‌ని.. ఆయ‌న గ‌తంలో జ‌గ‌న్‌ను ఉద్దేశించి ప‌రోక్షంగా వేరే కేసులో వ్యాఖ్య‌లు సంధించారు. అదే స‌మ‌యంలో గూగుల్ ఓ నెంబ‌ర్‌ను వెతికితే.. ఎవ‌రి చ‌రిత్ర క‌నిపిస్తుందో తెలిసి.. ఆశ్చ‌ర్య‌పోయానంటూ.. వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లో ఈ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించ‌గా.. ఇప్పుడు ర‌ఘు వేసిన పిటిష‌న్ మ‌రోసారి వైసీపీలో పెను కుదుపుల‌కు కార‌ణంగా మారింది.

ర‌ఘురామ వేసిన ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు చెబుతున్నారు. తాను వైసీపీ ఎంపీని కాబ‌ట్టి.. ప్ర‌జాప్ర‌యోజ‌నాల నేప‌థ్యంలో ఈపిటిష‌న్‌ను వేశాన‌ని చెప్పుకొనే అవ‌కాశం ర‌ఘురామ‌కు ఉంది. అయితే.. నేరుగా ఈ కేసుల‌తో ఏ ప్ర‌మేయం లేనందున .. ఆయ‌న పిటిష‌న్‌ను తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం కూడా వైసీపీ నేత‌ల మ‌ధ్య సాగుతోంది. అయితే.. ఏదేమైనా.. ప్ర‌స్తుత ప‌రిణామం .. మాత్రం పార్టీలో తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌గా మార‌డం గ‌మ‌నార్హం.