జగన్ మంచి కోసం రఘురామరాజు పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాది తిరక్కముందే.. ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రెబల్‌గా మారిపోయారు. ముందు మెల్లగా అసంతృప్త స్వరం వినిపిస్తూ, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన.. ఆ తర్వాత హద్దులు దాటిపోయారు. పూర్తిగా పార్టీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. సీఎం జగన్ సహా పార్టీ నాయకులందరి మీదా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వ విధానాలను తీవ్ర స్థాయిలో తూర్పారబట్టారు.

ఒక దశలో అదే పనిగా విమర్శలు చేస్తూ మీడియాలో హైలైట్ అయిన రఘురామ.. ఈ మధ్య జోరు తగ్గించారు. మీడియా కూడా ఆయనకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇలాంటి తరుణంలో, కొంచెం గ్యాప్ తర్వాత రఘురామ ఒక ఆసక్తికర చర్యతో మళ్లీ మీడియాలోకి వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఐతే ఇది జగన్ మంచి కోసం వేస్తున్న పిటిషన్ అని ఆయన చెప్పడం హైలైట్.

జగన్మోహన్‌రెడ్డి అవినీతి కేసులకు సంబంధించి11 సీబీఐ ఛార్జిషీట్లలో ఏ-1గా ఉన్నారని.. సీబీఐ చాలా ఛార్జిషీట్లు వేసినా… ట్రయల్ ఆలస్యంగా జరుగుతోందని రఘురామ అన్నారు. కేసుల విచారణలో జాప్యం జరుగుతోంని, ఆయన త్వరగా కేసుల నుంచి బటయపడాలనే మంచి ఉద్దేశంతోనే తాను ఈ కేసు వేశానన్నారు. తన పిటిషన్ వల్ల త్వరగా ఈ కేసు తేలిపోతుందని రఘురామ పేర్కొన్నారు. జగన్ గురించి ప్రత్యర్థులు నానా రకాలుగా మాట్లాడటం బాధాకరమని, వారికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే తాను హైకోర్టు తలుపుతట్టానన్నారు.

సీఎం కోర్టుకు వెళ్లకపోవడం… అనుమానించే విధంగా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని.. జయలలిత, లాలూ తదితరులు తమ స్థానంలో వేరే వారికి సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశమిచ్చి.. కేసుల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలని రఘురామ అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్లు రఘురామ తనదైన శైలిలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.