ఏపీ అధికారపక్షం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..టీడీపీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదన్న నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయమో.. వీర స్వర్గమో తేల్చుకోవాలే తప్పించి.. పోటీకి దూరంగా ఉండిపోవటం సాధ్యం కాదని తెలుగు తమ్ముళ్లు పలువురు స్పష్టం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నాం.. కష్టమో.. నష్టమో భరించాలి. యుద్ధం చేయాలే తప్పించి.. అస్త్రశస్త్రాల్ని ఇంట్లో దాచేస్తే రాజకీయ ఉనికికే ప్రమాదం ఉన్న వాదనను వినిపిస్తున్నారు.
అందుకే.. పార్టీ అధినేత మాటను పట్టించుకోకుండా.. తమకు బలమున్న ప్రాంతాల్లో అభ్యర్థుల్ని నిలిపి..వారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలా చేస్తున్న నేతల్లో కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఒకరు. అధినేత ఆదేశాల్ని లైట్ తీసుకున్న ఆమె.. పరిషత్ బరిలో నిలుస్తామని చెప్పటమే కాదు.. పలు చోట్ల పార్టీ అభ్యర్థుల్ని ఎన్నికల బరిలోకి దించేయటం ఆసక్తికరంగా మారింది.
తాను ప్రాతినిధ్యం వహించే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఆమె స్పస్టం చేస్తున్నారు. ఎన్నికల్ని బహిష్కరించే ప్రసక్తే లేదన్నఆమె.. అభ్యర్థుల తరఫు ప్రచారం చేసి ప్రజల్ని ఓట్లు వేయాలని అడుగుతామన్నారు. టీడీపీకి అభ్యర్థులు లేని చోట.. టీడీపీ ఓటర్లంతా నోటాకు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8న జరిగే ఈ ఎన్నికల పోలింగ్ ఫలితాలు పదిన వెల్లడి కానున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates