ఒకప్పుడు కాంగ్రెస్ మోసిన ఏపీ ప్రజలు రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో ఆ పార్టీని పక్కన పెట్టారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. అంతేకాదు.. కీలక నేతలు ఎంతో మంది పార్టీ మారిపోయారు. మరికొందరు తెరమరుగయ్యారు. అంటే.. దాదాపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాపచుట్టేసింది. మరి ఇదే పరిస్థితి ఇంకా కొనసాగుతుందా? ఎప్పటికీ కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేదా? అంటే.. మారుతున్న పరిస్థితులు.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారు.. కాంగ్రెస్ పుంజుకుంటుందని.. సమయం ఆసన్నమవుతోందని చెబుతున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని అంటున్నారు.
ఏపీ ప్రజల ఆశలు నెరవేరకపోవడం:
ప్రస్తుతం ఏపీ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. విభజన సమయంలో ఏపీ తీవ్రంగా నష్టపోతుందని భావించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. అయితే.. ఇప్పటి వరకు ఏ ఒక్కటీ నెరవేరలేదు. ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రజలు కలలు గంటున్నారు. కానీ, దీనిని ఇచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇప్పటి వరకు వేచి చూశారు. కానీ, బీజేపీ వల్ల ఈ హామీ నెరవేరదని తేలిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ఏపీ ప్రజల చూపు, ఆలోచన కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
2014 ఎన్నికలకు ముందు టీడీపీ + బీజేపీ కలిసినప్పుడు దేశవ్యాప్తంగా మోడీవేవ్ ఉండడంతో మోడీ ఏపీకి ఏదేదో చేసేస్తాని ఇక్కడ ప్రజలు కలలు కన్నారు. కట్ చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీ రాజకీయ నాయకులను బకరాలను చేసి ఈ రాష్ట్రంతో ఎలా గేమ్ ఆడుతూ ప్రజలను మోసం చేస్తుందో ? నిశితంగా గమనిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి.. వచ్చే 2024 ఎన్నికల సమయానికి 10 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న పార్టీల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లభించలేదని కనుక ప్రజలు అనుకుంటే.. తిరిగి కాంగ్రెస్‌కు పునర్వైభవం ఖాయమని చెబుతున్నారు. ఏదైనా జాతీయ పార్టీతో ఏపీకి మేలు జరుగుతుంది అనుకుంటే అది కాంగ్రెస్‌తో మాత్రమే అన్న ఓ విశ్వాసం అయితే ఏపీ ప్రజల్లో కలుగుతోంది.
స్థానిక పార్టీలపై విసుగు:
రాష్ట్రంలో రెండు బలమైన పార్టీలు ఉన్నాయి. ఒకటి ప్రతిపక్షం టీడీపీ కాగా, రెండోది అధికార పక్షం వైసీపీ. అయితే.. ఈ రెండింటినీ.. రాష్ట్ర విభజన తర్వాత.. ప్రజలు ఒకదానితర్వాత ఒకదానికి అధికారం ఇచ్చారు. ఎందుకంటే.. విభజన హామీలను సాధిస్తారని వారు ఆశపెట్టుకుని ఉన్నారు.కానీ, ఇప్పుడు టీడీపీ, వైసీపీలపై ప్రజలకు నమ్మకం పోయిందనే భావన వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా విషయంలోకానీ.. పోలవరం విషయంలోకానీ..ఈ రెండు పార్టీలకు కేంద్రం వద్ద చుక్కెదురు అవుతోంది.
ఈ రెండు పార్టీలు గత ఏడెనిమిదేళ్లుగా బీజేపీతో అంట కాగుతూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారన్నది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా వైసీపీ, టీడీపీలు కుటుంబ పార్టీలని కూడా ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ప్రజల నాడి కాంగ్రెస్‌వైపు మళ్లే అవకాశం ఉందని ఓ అంచనాకు వచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. సో.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పుంజుకుంటుందనేది ప్రస్తుత అంచనా. అయితే ఆ పార్టీని నడిపించే బలమైన నాయకులే ఇప్పుడు అవసరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates