2019 మే వరకు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం. కానీ అధికారం కోల్పోయి రెండేళ్లు తిరక్కముందే ఆ పార్టీ పతనావస్థకు చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలోనూ ఆ పార్టీకి ఎన్నికల్లో పరాభవాలు ఎదురయ్యాయి. నాయకులు, కార్యకర్తలు డీలా పడ్డారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పతనం వైపు అడుగులేస్తుండటం, పార్టీ భవిష్యత్తే ప్రమాదంలో పడిపోయే పరిస్థితులు రావడం విస్మయానికి గురి చేస్తోంది.
ఇటీవల పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవాలు తప్పలేదు. ముఖ్యంగా పార్టీ గుర్తుల మీదే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. రాబోయేఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అయినా ఆ పార్టీ పోరాట స్ఫూర్తిని కనబరిచి, మెరుగైన ఫలితాలు రాబడుతుందేమో అనుకుంటే.. ఈ ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం కార్యకర్తలకు పెద్ద షాక్. ఈ నిర్ణయం వల్ల టీడీపీకి ఏం ప్రయోజనమో ఎవరికీ అర్థం కావడం లేదు. దీని వల్ల పార్టీ ఉనికే ప్రమాదంలో పడిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఫలితాలకు భయపడే టీడీపీ వెనుకంజ వేసిందనే అభిప్రాయం జనాల్లో కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్లో #Endoftdp అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండటం గమనార్హం. ఈ హ్యాష్ ట్యాగ్ మీద పెద్ద ఎత్తున ట్వీట్లు పడుతున్నాయి. ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తూ నెటిజన్లు విమర్శనాత్మక ట్వీట్లు వేస్తుున్నారు. దీనికి టీడీపీ మద్దతుదారులు కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఎన్నికల్లో పరాభవం చవిచూశాక ఏ పార్టీ అయినా డీలా పడటం.. కార్యకర్తల్లో ఉత్సాహం కొరవడటం సహజం. అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రతిపక్షాన్ని దెబ్బ తీయాలని చూడటమూ మామూలే. ఇలాంటి సమయంలోనే స్థైర్యం కోల్పోకుండా నిలవడం.. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇవ్వడం.. పోరాట స్ఫూర్తిని కనబరచడం అధినాయకత్వం బాధ్యత.
కానీ తెలుగుదేశం పార్టీలో ఇదే కొరవడుతున్నట్లుంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండేళ్లుగా ఎక్కువగా హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు. కరోనా వల్ల కొన్ని నెలలు హైదరాబాద్‌లోనే ఉండటంలో తప్పు లేదు. కానీ దానికి ముందు, తర్వాత కూడా ఆయన హైదరాబాద్‌ను వదలట్లేదు. ఇక్కడ ఆయన కుటుంబానికి వ్యాపారాలుండొచ్చు. బంధువులు, సన్నిహితులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉండొచ్చు. కానీ బాబు రాజకీయాలు చేయాల్సింది, పార్టీని నడిపించాల్సింది ఏపీలో. కానీ ఆయన ఆ పని చేయట్లేదు. ప్రతిపక్ష పార్టీగా టీడీపీ క్షేత్రస్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు, పోరాటాలు చేయట్లేదని.. జనాల్లో ఉండట్లేదని.. ఇలాంటపుడు పార్టీకి ఎక్కడ మనుగడ ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి బాబు అండ్ కో ఏం సమాధానం చెబుతారో?