సూపర్ స్టార్ రజినీకాంత్‌ను అత్యున్నత సినీ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఇది ఆయనతో పాటు అభిమానులందరికీ ఎంతో సంతోషాన్నిచ్చే విషయమే. ఈ విషయం వెల్లడి కాగానే ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి అందరూ కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఐతే రజినీ ఈ పురస్కారానికి పూర్తి అర్హుడే అయినా.. ఆయనకీ అవార్డు దక్కడం అందరినీ ఆనందింపజేస్తున్నా.. ఈ అవార్డు ఇప్పుడే ఆయనకు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం మీద చర్చ జరుగుతోంది. మరి కొన్ని రోజుల్లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందులో ప్రయోజనం కోసమే మోడీ సర్కారు రజినీకి అవార్డు ప్రకటించిందని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేతో కలిసి బీజేపే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
తమిళనాట బీజేపీ ప్రభావం అంతంతమాత్రమే అయినప్పటికీ.. జయలలిత మరణానంతరం నాటకీయ పరిణామాల మధ్య అధికార పార్టీని తన చెప్పుచేతల్లో ఉండేలా చేసుకోగలిగింది కేంద్ర ప్రభుత్వం. దాని అండతో ఆ రాష్ట్రంలో బలపడేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది భాజపా. మరోవైపు రజినీని తమ పార్టీలోకి లాగడానికి భాజపా గట్టి ప్రయత్నమే చేసింది. ఆయన్ని ఎప్పట్నుంచో దువ్వుతోంది. ఆయన పార్టీ పెట్టినా కూడా భాజపాకు మద్దతు ఇచ్చేలా చూడాలని ప్రయత్నించారు. కానీ రజినీ రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లే పెట్టి ఆరోగ్య కారణాల రీత్యా వెనక్కి తగ్గారు.
ఐతే రజినీ రాజకీయాల్లో లేడు కాబట్టి ఆయన నుంచి పరోక్ష మద్దతు అయినా తీసుకోవాలని అన్నాడీఎంకే-భాజపా కూటమి గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రజినీకి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించడం ద్వారా ఆయన అభిమానుల మనసు గెలిచి ఎన్నికల్లో తమ కూటమికి సానుకూల ఫలితాలు రాబట్టాలనే వ్యూహాత్మకంగా ప్రకటన చేశారని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates