రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం.. ఆయా పథకాలకు తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కొన్ని పథకాలకు తన పేరును, పార్టీ అధినేత ఎన్టీఆర్ పేరును పెట్టుకున్నారు. అయితే.. అప్పట్లో చంద్రబాబును విమర్శించిన వైసీపీ అధినేత జగన్.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే.. తను ప్రవేశ పెడుతున్న పథకాలకు తన పేరు, తన తండ్రి పేరును పెట్టుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నారు.
జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా.. వైఎస్సార్ వాహన మిత్ర, ఇలా అనేక పథకాలకు పేర్లు పెట్టున్నారు. ఇలా ఒక్కొక్క పథకానికి పేర్లు పెట్టేందుకు, ఆయా పేర్ల వెనుక ఉన్న సందర్భాన్ని వివరించేందుకు కొందరు సలహాదారులు జగన్ దగ్గర పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో నూతనంగా ప్రవేశ పెట్టే పథకానికి సంబందించి వారు కూలంకషంగా చర్చించుకుని.. ఆయా పథకాలకు ఎవరి పేరు అయితే.. బాగుంటుందనే విషయాన్ని సూచిస్తున్నారు. రైతులతో ముడిపడిన పథకాలకు వైఎస్సార్ పేరును, యువత, ఓ వర్గం మహిళలకు సంబంధించిన పథకాలకు జగన్ పేరును సూచించారు.
దీనివెనుక పథకాలు పొంది ప్రజలు ఎంత లబ్ధి పొందుతున్నారో.. అదేవిధంగా.. ఆయా పథకాల పేర్లతో పార్టీ కూడా లబ్ధి పొందాలనే సూత్రం ఇమిడి ఉందనేది వాస్తవం. ఇక, ఇప్పుడు ఈ కోవలోనే మహానేత
పేరుతో ఒక పథకాన్ని తీసుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పేరు వైసీపీ వర్గాల్లో మార్మోగుతోంది. మరికొన్ని నెల్లలోనే మేనిఫెస్టోలో పేర్కొన్న ఒకటి రెండు పథకాలను కూడా అమలు చేయనున్నారు. ఈ క్రమంలో ఒక పథకానికి మహానేత అనే పేరు పెట్టాలని డిసైడ్ అయినట్టు సమాచారం. వాస్తవానికి మహానేత అనేది వైఎస్ రాజశేఖరరెడ్డిని కొనియాడేందుకు వైసీపీ వాడే పదం.
అయితే.. ఎల్లో మీడియాగా వైసీపీ పేర్కొనే కొన్ని పత్రికలు ఈ పేరును వ్యంగ్యాస్త్రంగా సంధిస్తున్నాయి. ఈ క్రమంలో ఇకపై ఇలాంటి ఛాన్స్ ఇవ్వకుండా చేసేందుకు మహానేత
పేరుతో ఒక కీలక పథకాన్ని తీసుకువచ్చి.. మంచి ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించుకున్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తుండడం గమనార్హం. మరి ఆ పథకం ఏంటి? ఎలా ? అనే విషయాలపై సలహాదారులు వర్కవుట్ చేస్తున్నారని వైసీపీ నేతల మధ్య గుసగుస వినిపిస్తోంది.