బీజేపీకి ఇష్యూయే దొరకటంలేదా ?

వినటానికి విచిత్రంగానే ఉన్నా ఇదే నిజమట. కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీకి, రాష్ట్రంలో తామే ఇఫుడు నిజమైన ప్రతిపక్షమని గొంతుచించుకునే పార్టీకి ఇష్యు లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ తరపున రత్నప్రభ పోటీచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు సమస్యేమిటంటే కమలంపార్టీకి అభ్యర్ధే పెద్ద మైనస్.

ఎందుకంటే అభ్యర్ధి పార్టీ నేతల్లోనే చాలామందికి పరిచయమే లేదు. నేతలకే పరిచయం లేదంటే ఇక మామూలు జనాలగురించి చెప్పాల్సిన పనేముంది ? అందుకే పార్టీ అనేక సమస్యలను ఫేస్ చేస్తోంది. ముందు అభ్యర్ధిగురించి పరిచయటం చేయటంతోనే నేతలకు సమయం సరిపోతోంది. తర్వాత రాష్ట్రానికి పార్టీ ఏమి చేసింది ? ప్రత్యేకంగా తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఏమైనా చేసిందా ? అనే విషయాలను హైలైట్ చేయాలి.

కేంద్రం తరపున రాష్ట్రానికి ఏమైనా జరిగుంటే దాన్ని చెప్పుకోవటానికి ఏమీలేకపోగా అతిపెద్ద మైనస్ పాయింట్లు మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తోంది. బీజేపీ నేతృత్వంలో ఏడేళ్ళ క్రితం కేంద్రంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి జరిగిన మేలేమీలేదు. పైగా రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బకొట్టేస్తోంది. ముందు విభజన చట్టంలో ప్రధానమైన ప్రత్యేకహోదా, విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ ను తుంగలో తొక్కేసింది.

ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయినవని అనుకుంటే తాజాగా వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటుపరం చేసేసింది. తర్వాత గంగవరం పోర్టు నిర్మాణం తన బాధ్యత కాదని తప్పించుకుంది. ఇలా ఎక్కడికక్కడ ఏపిని దెబ్బకొడుతున్న బీజేపీకి జనాలు ఎలా ఓట్లేస్తారనే అంశం నేతలను పట్టి పీడిస్తోందట. ఎందుకంటే మొన్నటి వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల్లోనే జనాలు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అండ్ కో ను ప్రచారంలో ఉతికి ఆరేశారు. దాంతో ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి జెండా ఎత్తేశారు.

మరి ఇదే సమస్య ఇపుడు తిరుపతి లోక్ సభ ప్రచారంలో కూడా ఎదురవుతోందట. ఏపి ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బకొడుతున్న బీజేపీకి ఎందుకు ఓట్లేయాలని జనాలు నిలదీస్తున్నారట. వారికి సమాధానం చెప్పుకోలేక కమలనాదులు నానా అవస్తలు పడుతున్నారు. నామినేషన్ కు ముందే జనాలకు సమాధానాలు చెప్పుకోలేని నేతలు రేపు ఎన్నికల వేడి రాజుకుందంటే ఇంకేమని ప్రచారం చేయగలరబ్బా ?