వ్యూహాత్మ‌క నిర్ణ‌యాల‌తో.. జ‌గ‌న్ ఆక‌ర్ష్ పాలిటిక్స్‌

రాజ‌కీయాల్లో వ్యూహాలు అమ‌లు చేయ‌డం వేరు.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం వేరు. వ్యూహాలు కామ‌న్‌గా అన్ని పార్టీల నాయ‌కులు అమ‌లు చేస్తుంటారు. అవి ఒక్కొక్క‌సారి విజ‌యవంతం అవుతాయి.. కొన్నికొన్ని సార్లు విక‌టిస్తాయి.. కానీ, వ్యూహాత్మ‌క నిర్ణ‌యాలు.. మాత్రం ఖ‌చ్చితంగా విజ‌యం దిశ‌గానే అడుగులు వేస్తాయ‌ని అంటారు ప‌రిశీల‌కులు. ఇలాంటి వ్యూహాత్మ‌క నిర్ణ‌యాలు.. ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్నారు. స్థానిక ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు రోడ్డెక్కి ప్ర‌జ‌ల్లోకి వెళ్లినా.. పెద్ద‌గా ఫ‌లితం క‌క‌నిపించ‌లేదు.

కానీ, అదేస‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ గ‌డ‌ప దాట‌కుండా ఎన్నిక‌ల‌ను శాసించారు. రెండు రోజుల్లో కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ఉన్నాయ‌ని అన‌గా… 45 ఏళ్లు నిండిన అగ్ర‌వ‌ర్ణ మ‌హిళ‌ల‌కు కూడా చేయూత ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు.. ఈ ప‌థ‌కం కింద‌.. ఏటా 15 వేలు చొప్పున వారికి అందిస్తారు. అదేస‌మ‌యంలో మ‌హిళా ఉద్యోగుల మెట‌ర్నిటీ లీవ్ స‌హా.. కాజువ‌ల్ సెల‌వుల‌ను పెంచారు. ఈరెండు నిర్ణ‌యాలు కూడా ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌బావం చూపించాయి. వాస్త‌వానికి జ‌గ‌న్ వేసిన ఈ వ్యూహాన్ని టీడీపీ నేత‌లు గుర్తించే స‌రికి పుణ్య‌కాలం గ‌డిచిపోయింది. స‌రే! ఇదంతా అయిపోయింద‌ని అనుకున్నా..

ఇక‌, ఇప్పుడు కూడా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఆయ‌న క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లు విమానాశ్ర‌యంలో విమానాల రాక‌పోక‌ల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సీమ ప్ర‌జ‌ల ముఖ్యంగా క‌ర్నూలు ప్ర‌జ‌ల సెంటిమెంటును త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ విమానాశ్ర‌యానికి స్వాతంత్ర స‌మ‌ర సింహం.. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పేరును ఖ‌రారు చేసిన‌ట్టు వేదిక‌పైనే ప్ర‌క‌టించారు. ఇది సెంటిమెంటుతో ముడిప‌డిన వ్య‌వ‌హారం కావ‌డంతో ఇప్పుడు సీమ కోరిక‌లు.. తీర్చే నేత ఎవ‌రైనా ఉన్నారా? అంటే.. ఒక్క జ‌గ‌నే అనే మాట వినిపించేలా చ‌క్రం తిప్పారు.

ఇక‌, రాజ‌ధాని అమ‌రావ‌తిని త‌ర‌లించేస్తున్నార‌నే వాద‌న‌కు ఫుల్ స్టాప్ పెడుతూ.. అభివృద్ధి నినాదం అందుకున్నారు.. మూడు ద‌శ‌ల్లో మూడు బ్యాంకుల నుంచి 10 వేల కోట్ల‌ను అప్పుచేసి.. రాజ‌ధానిని అభివృద్ధి చేసేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని తాజాగా జీవో ఇచ్చారు. ఇప్ప‌టికిప్పుడు 3 వేల కోట్ల‌ను ప్ర‌భుత్వ హామీపై తీసుకుంటున్నామ‌ని కూడా ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.. ఫ‌లితంగా ఇప్ప‌టికిప్పుడు ప్ర‌భుత్వంపై ఎవ‌రూ ఎలాంటి విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం లేకుండా చేశారు. ఇదంతా కూడా చాలా ప‌క‌డ్బందీ వ్యూహంతో అత్యంత వ్యూహాత్మ‌కంగా జ‌గ‌న్ వేస్తున్న అడుగులని.. వీటిని, వీటిలో మ‌ర్మాన్ని… ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ క‌నుక గుర్తించ‌క‌పోతే… మున్ముందు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.