ఇపుడిదే అంశం అందరినీ పట్టి పీడిస్తోంది. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మం హెడ్ క్వార్టర్స్ లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు షర్మిల తరపున అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా చరిత్రలోనే జరగని విధంగా బహిరంగసభ అద్దిరిపోవాలని షర్మిల ఇప్పటికే ఆదేశాలు ఇచ్చున్నారు. లక్షమందికి తక్కువ కాకుండా జనాలు హాజరయ్యేట్లుగా ఏర్పాట్లు జరగాలని తన మద్దతుదారులతో ఇప్పటికే గట్టిగా చెప్పారు. అందుకనే ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి.
అయితే తెలంగాణాలో హఠాత్తుగా పెరుగుతున్న కరోనా వైరస్ కారణంగా బహిరంగసభ నిర్వహణ సందిగ్దంలో పడింది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు 300 కరోనా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. ఒక్కసారిగా వందలాది కరోనా కేసులు వెలుగు చూడటాన్ని ప్రభుత్వం బాగా సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్ధలన్నింటినీ మూసేయటం ఇందులో భాగమే. అయితే ముందుముందు పరిస్ధితి మరింత సీరియస్ అయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వం అనుమానిస్తోంది.
ఒకవేళ అదే జరిగితే మళ్ళీ లాక్ డౌన్ విధించటమా లేకపోతే ముందుగా రాత్రుళ్ళు కర్ఫ్యూ విధించటమా ? అనే విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచిస్తోంది. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో బహిరంగసభ నిర్వహణకు దగ్గరపడుతోంది. కాబట్టి అప్పటికి కరోనా వైరస్ ప్రమాదం పెరిగితే మాత్రం బహిరంగసభకు అనుమతులు రద్దు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బహిరంగసభకు లోటస్ పాండ్ వర్గాలు అనుమతులు అడిగారు.
బహిరంగ సభ జరిగే గ్రౌండ్ మున్సిపాలిటి కాబట్టి మున్సిపల్ అథారిటీస్ అనుమతులిచ్చారు. పోలీసులు అనుమతిచ్చినా కోవిడ్ నేపధ్యంలో షరతులు విధించారు. శానిటైజర్లు వాడాలని, అందరు మాస్కులు ధరించాలనే నిబంధనలు విధించారు. అధికారులు అన్నీ అనుమతులు ఇచ్చినా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపధ్యంలో బహిరంగసభకు అవరోధాలు వస్తాయేమోనని లోటస్ పాండ్ వర్గాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇతరత్రా ఏదైనా కారణాలు చెబితే ఏమోగానీ కరోనా వైరస్ సమస్యను చూపించి బహిరంగసభకు అభ్యంతరాలు చెబితే ఎవరు చేయగలిగేదేమీలేదు. మరి అప్పటివరకు ఏమి జరుగుతుందో చూద్దాం.