తాడిపత్రిని కేస్ స్టడీగా తీసుకుంటాడా ?

మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ రాష్ట్రమంతా తుడిచిపెట్టుకుపోయింది. మంచి బలమైన క్యాడర్ ఉన్న టీడీపీకి ఇలాంటి పరిస్ధితి వస్తుందని ఎవరు ఊహించుండరు. లీడర్లు ఎంతమంది పోయినా పర్వాలేదు, క్యాడర్ మాత్రం పార్టీతోనే ఉందని చంద్రబాబు చాలాసార్లే చెప్పుంటారు. అలాంటి క్యాడర్ ఇప్పుడు పార్టీతోనే ఉందా లేదా అనే అనుమనాలు పెరిగిపోతున్నాయి.

75 మున్సిపాలిటిలకు ఎన్నికలు జరిగితే 74 చోట్ల వైసీపీ స్వీప్ చేసేసింది. 98 శాతం మున్సిపాలిటిల్లో కనీసం సగం వార్డులను కూడా గెలుచుకోలేదు. ఇక 11 కార్పొరేషన్ల ఫలితాలు వస్తే నూరుశాతం వైసీపీనే గెలిచింది. మైదుకూరులో కూడా గట్టిపోటి ఇచ్చిందనే చెప్పినా చివరకు ఆ మున్సిపాలిటి అధికారపార్టీ ఖాతాలోనే పడిపోయింది. ఇంతటి ప్రభంజనంలో కూడా ఒకే ఒక్క మున్సిపాలిటి తాడిపత్రిలో మాత్రం టీడీపీ గెలిచింది.

ఇదే అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. బహుశా చంద్రబాబుకు కూడా ఆశ్చర్యమేసుంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఏదో గాలివాటున తాడిపత్రిలో టీడీపీ గెలవలేదు. నిజానికి ఇక్కడ టీడీపీ గెలుపు అనేకన్నా జేసీ సోదరుల వ్యక్తిగత విజయమనే చెప్పాలి. మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా పోటీచేశారు. ఒకపుడు కౌన్సిలర్ గాను తర్వాత ఛైర్మన్ గా ప్రభాకర్ పనిచేశారు.

ఛైర్మన్ గా ఉన్నపుడు ప్రభాకర్ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేశారని, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని బాగా అమలు చేశారని పేరు. సరే చరిత్రను వదిలేసినా ఇపుడు ప్రభాకర్ కౌన్సిలర్ గా పోటీ చేసిన కారణంగా మొత్తం జేసీల మద్దతుదారులు+పార్టీ క్యాడర్ రంగంలోకి దిగింది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాటం చేశారందరు. దాని ఫలితంగానే 36 వార్డుల మున్సిపాలిటిలో 18 వార్డుల్లో టీడీపీ లేదా జేసీ వర్గం గెలిచింది.

మొదటినుండి సీపీఐ, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వారు కూడా జేసీ వర్గంతోనే ఉన్న కారణంగా వాళ్ళు గెలిచిన తర్వాత జేసీకి మద్దతుగానే నిలబడ్డారు. అయితే ఇక్కడ గమనించాల్సినది ఏమంటే తాడిపత్రిలో కూడా వైసీపీ జెండా ఎగరేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకునుంటే ప్రభాకర్ ఛైర్మన్ అయ్యేవారు కాదు. ఏదో పద్దతిలో కౌన్సిలర్లను మాయచేసో లేదా బెదిరించో వైసీపీలోకి లాక్కునే వారే. అది కుదరకపోతే కనీసం ఛైర్మన్ ఎన్నిక సమయంలో జేసీ వర్గంలో కొందరిని గైర్హాజరు చేసున్నా వైసీపీ గెలిచేదే.

అయితే ఆపని చేయాలని జగన్ అనుకోలేదు. సంఖ్యాపరంగా టీడీపీకి మెజారిటి ఉంది కాబట్టి ఛైర్మన్ పదవిని ఆపార్టీకే వదిలేయాలని జగన్ అనుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాకరే చెప్పటం విశేషం. తాను ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నానంటే అందుకు జగన్ కట్టుబడిన నైతిక విలువలే కారణమని ప్రభాకర్ చెప్పారు. మరి తాడిపత్రిలో ఉన్నదేమిటి ? మిగిలిన మున్సిపాలిటిల్లో లేనిదేమిటి ? అనే విషయమై చంద్రబాబు కేసు స్టడీ చేస్తారా ?