ఎంపీ రామ్మోహన్ భావోద్వేగ ప్రసంగాన్ని విన్నారా?

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు.. నినాదం బాగానే ఉన్నా.. కేంద్రంలోని మోడీ సర్కారు అమ్మేయాలని డిసైడ్ అయ్యింది. విశాఖ ఉక్కు ప్రస్తావన వచ్చినంతనే.. నష్టాలు వస్తున్నాయి.. విలువైన ప్రజల పన్ను మొత్తాల్ని ఎందుకు వేస్ట్ చేయటం అంటూ కేంద్రం చెబుతున్న మాటల్లోని అసత్యాన్ని కళ్లకు కట్టేలా చెప్పటమే కాదు.. విశాఖ ఉక్కు అమ్మకంపై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంలోని డొల్లతనాన్ని సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ప్రసంగించారు ఏపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. పార్టీలకు అతీతంగా ఆయన చేసిన ప్రసంగానికి బల్లలు చరచటమే కాదు.. అందరూ ఆయన్ను అభినందించే పరిస్థితి.

తెలుగోడి గొంతును జాతీయ స్థాయిలో వినిపించే నేతలు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోతున్నారన్న వేదన పలువురి వినిపిస్తున్న వేళ.. అలాంటిదేమీ లేదు.. మనకూ ఉన్నారన్న భావన కలిగించేలా రామ్మోహన్ తాజా స్పీచ్ ఉందని చెప్పాలి. లోక్ సభలో ఈ యువ ఎంపీ చేసిన ప్రసంగం వింటే.. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం తప్పంటే తప్పన్న భావన కలగటం ఖాయం. ఇంతకీ ఆయన ప్రసంగంలో ఏమేం అంశాల్ని ప్రస్తావించారన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చెబితే..

  • విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఏపీ.. తెలంగాణ ప్రజలు కలిసి కేంద్రంపై పోరాడారు. 32 మంది ఆత్మ బలిదానాలు చేశారు. 22వేల మంది రైతులు భూములు ఇచ్చారు. తెలుగు ప్రజల త్యాగాలపై నిర్మించిన ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వానికి విశాలమైన మనసు ఉంటే ఈ విషయాన్ని గుర్తించాలి.
  • విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకంపై కేంద్రం రెండు వాదనలు వినిపిస్తోంది.అందులో మొదటిది.. కర్మాగారం ఖాయిలా పడిందని చెబుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నా.
  • 2000 నుంచి 2015 మధ్య కాలంలో విశాఖ ఉక్కు రాబడి రూ.1.04లక్షల కోట్లు. పన్నులు పోనూ ఆదాయం రూ.12,600 కోట్లు. 13 ఏళ్లు నిరంతరంగా వందశాతం సామర్థ్యంతో పని చేసింది. 1.03 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేసింది. కోవిడ్ వేళలోనూ కార్మికులు నిరంతరం పని చేశారు.
  • ఈ కారణంతో 2020 డిసెంబరులో రూ.212 కోట్లు.. జనవరిలో రూ.134 కోట్లు.. ఫిబ్రవరిలో రూ.165 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెలలో (మార్చి) రూ.300 కోట్లకు పైనే ఆదాయం వస్తుందని అంచనా. కేంద్రం చెబుతున్న రెండో వాదనను ఇప్పుడు చెబుతా.
  • ఖాయిలా పడిన పరిశ్రమతో పన్నుచెల్లింపుదారుల విలువైన డబ్బులు వేస్ట్ అవుతున్నాయని. ఈ వాదనను వ్యతిరేకిస్తున్నా. కర్మాగారం ప్రారంభం నుంచి కేంద్రం ఈక్విటీగా రూ.4900 కోట్లు.. పునర్మిర్మాణానికి రూ.1300 కోట్లు.. అంటే మొత్తంగా రూ.6200 కోట్లను ఖర్చు చేసింది.
  • విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్రానికి పన్నులు.. డివిడెండ్ల రూపంలో రూ.43వేల కోట్లకుపైగా తిరిగి చెల్లించింది. ఇది కేంద్రం పెట్టిన పెట్టుబడికి ఐదు రెట్ల కంటే ఎక్కువ.
  • తెలుగు ప్రజల తరఫున నేను రెండు డిమాండ్లు చేస్తున్నా. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలి. సెయిల్.. ఇతర కర్మాగారాలకు సొంత గనులు ఉండటంతో అవి టన్నురూ.1500లకు ముడి సరుకు పొందుతుంటే.. సొంత గనులు లేని విశాఖ ఉక్కు టన్నుకు రూ.7వేలు చెల్లించాల్సి వస్తోంది.
  • దీంతో ప్రతి టన్నుకు రూ.5260కు పైగా నష్టపోతోంది. రెండోది వడ్డీ రేట్లు తగ్గించాలి. టాటా ఉక్కు కర్మాగారం బ్యాంకుల నుంచి 8 శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటూ ఉంటే.. ప్రభుత్వ ఆధీనంలోని విశాఖ ఉక్కు కర్మాగారం 14 శాతం రేటునుకు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో రూ.1500 కోట్లు వడ్డీల రూపంలో నష్టపోతోంది. మీరెందుకు సెయిల్.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విలీనం చేయరు?
  • మనం ఒకవైపు చైనా యాప్ లను బ్లాక్ చేస్తున్నాం. మరోవైపు మడి ఇనుములో 82 శాతం చైనాకు ఎగుమతి చేస్తున్నాం. దేశంలోనే చక్కగా పని చేసే ఉక్కు కర్మాగారాలు మీ అధీనంలో ఉన్నప్పుడు మీరెందుకు వాటికి సాయం చేయరు?