ముఖ్య‌మంత్రిపైనే ఓ ద‌ళిత మ‌హిళ పోటీ.. క‌న్నీళ్లు ఆగ‌వు..!


ఇదో చిత్ర‌మైన వ్య‌వ‌హారం. ముందు అంద‌రూ ఆమెను నిరుత్సాహ ప‌రిచారు. అంత పెద్దోళ్ల‌తో నీకెందుకు ? అని ప్ర‌శ్నించారు. అయితే.. ఆమె త‌న ప‌ట్టుద‌ల‌ను, క‌సిని ఏమాత్రం స‌డ‌ల‌నివ్వ‌లేదు. ఓడితే ఓడాను.. కానీ, నా కుటుంబానికి జ‌రిగిన అన్యాయం ఈ రాష్ట్ర‌మే కాకుండా.. ఈ దేశం మొత్తానికి గుర్తుకు రావాలి. ఈ సీఎంకు బుద్ధి రావాలి అని గ‌ట్టిగా సంక‌ల్పించుకున్నారు. ఆ వెంట‌నే ఏకంగా.. ముఖ్య‌మంత్రిపై పోటీకి దిగారు. ఆమే.. కేర‌ళ కు చెందిన సామాన్య ద‌ళిత మ‌హిళ‌, వలయార్‌ సిస్టర్స్ మాతృ మూర్తి.(నిబంధ‌న‌ల మేర‌కు పేరు వెల్ల‌డించ‌రాదు) మ‌రి ఎందుకు ఇంత తీవ్ర‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు? ఏకంగా ముఖ్య ‌మంత్రిపైనే ఒక సామాన్య మ‌హిళ ఎన్నిక‌ల్లో పోటీకి ఎందుకు దిగారు? ఇదో స్ఫూర్తి.. ఇదో కొడిగ‌ట్ట‌ని క‌న్నీటి గాధ‌. మ‌న‌సున్న వాళ్లు‌.. మ‌ద్ద‌తుగా నిల‌వాల్సిన మాతృమూర్తి ఆవేద‌న‌.. తాలూకు అంత‌ర్ముఖం!!

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ధర్మదం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు వ‌ల‌యార్ సిస్ట‌ర్స్ మాతృమూర్తి. ఆమేమీ డ‌బ్బున్నకుటుంబం నుంచి వ‌చ్చిన మ‌హిళ‌కాదు. అత్యంత బీద‌రికంతో అల్లాడుతున్న కుటుంబం. అయితే.. ఆమెలో ఊట‌బావి వంటి ఆవేద‌న ఉంది. గుండె ప‌గిలిపోయే రోద‌న ఉంది. అదే ఇప్పుడు ఆమెను ఎన్నిక‌ల బాట ప‌ట్టించింది. ఏం జ‌రిగిందంటే.. పాలక్కాడ్‌ జిల్లా వాయలూర్‌లో ఉంటున్న ఆమెకు ఇద్దరు కూతుళ్లు. నాలుగేళ్ల క్రితం ఆ ఇద్దరు మైనరు కూతుళ్లపై అత్యాచారం జరిగింది. తర్వాత వాళ్లిద్దరూ 2017 జనవరి 13న పెద్ద కూతురు (13), అదే ఏడాది మార్చి 4న చిన్న కూతురు (9) వాళ్లింట్లోనే దూలాలకు ఉరి వేసుకున్నారు.

వాళ్లపై అత్యాచారం చేసి, ఉరి వేసి వెళ్లినవారికి శిక్ష పడేలా చేసేందుకు నాలుగేళ్లుగా ఆమె నిద్రాహారాలు మాని, అదే జీవితావ సరంగా ప్రభుత్వానికి మొర పెట్టుకుంటూనే ఉంది. అనేక విధాలుగా తన నిస్సహాయ నిరసనలను వ్యక్తం చేసింది. ఆక్రోశంతో శిరోముండనం చేయించుకుంది. ఆఖరి అస్త్రంగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిపైనే ఆమె పోటీకి దిగారు. తను గెలిస్తే తన కూతుళ్లకు జరిగిన అన్యాయం గురించి తెలుస్తుందనీ, దోషుల్ని తప్పించేందుకు పోలీసులు చేసిన అక్రమాల గురించి తెలుస్తుందని ఆమె ఆశ. అంతే తప్ప అధికారం కోసం కాదు!!

‘‘నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నాను. ‘దోషులకు శిక్ష పడి తీరుతుంది’ అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి తన మాటను నిలబెట్టుకోలేదు. ఒక తల్లిగా ఇప్పటి వరకు న్యాయపోరాటం చేశాను. ఇక రాజకీయ పోరాటం చేస్తాను’’ అని ఆమె అంటున్నారు. పోస్ట్‌మార్టంలో ఇద్దరు పిల్లలూ చనిపోవడానికి ముందు వారిపై అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయింది. ‘‘మా బంగారు తల్లులను పాడుచేసి, చంపేశారు. వాళ్లది ఆత్మహత్య కాదు’’ అని ఆమె ఫిర్యాదు చేసినట్లే, శవ పరీక్ష నివేదిక కూడా సరిగ్గా వచ్చింది. ఆ తల్లిదండ్రుల తరఫున కేరళ వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. అప్పటికప్పుడు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వారిలో ఒకరు గత ఏడాది పోలీసు విచారణలో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు.

‘‘ కొంతమంది పోలీసులు నేరస్థులతో కుమ్మక్కయి కేసును బలహీనపరిచి ప్రమోషన్‌లు పొందారు. సీఎం చూస్తూ ఊరుకున్నారు. ఈ సంగతి ప్రజలకు తెలియాలి. ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లికి ఈ ముఖ్యమంత్రి న్యాయం చేయలేకపోయారని ప్రజలందరికీ తెలియాలి’’ అని తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ ఆమె అన్నారు. నేరస్థులలో కొందరికి అధికార పార్టీలోని వారితో సంబంధాలు ఉండటంతో కేసు నీరు కారిపోయిందని ప్రతిపక్షాలు మొదట్నుంచీ ఆరోపిస్తూనే ఉన్నాయి. మ‌రి.. ఓట‌రు మ‌హాశ‌యులు త‌మ‌కు మ‌న‌సు చాటుకుంటారో.. లేదో చూడాలి.