ఎన్నికల్లో గెలవటానికి ముఖ్యమైన అంశాల్లో సోషల్ ఇంజనీరింగ్ కూడా చాలా కీలకం. సోషల్ ఇంజనీరింగ్ అంటే సామాజికవర్గాల వారీగా ప్రాధాన్యత ఇవ్వటం. సామాజికవర్గాల దామాషా ప్రకారం టికెట్లు కేటాయించటం, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని పంచటం, పార్టీ పదవుల్లో నియామకాలు చేయటం. సోషల్ ఇంజనీరింగ్ లో చంద్రబాబునాయుడు ఫెయిలైన కారణంగానే మొన్నటి ఎన్నికల్లో పార్టీ అంత ఘోరంగా ఓడిపోయింది.
పార్టీ పెట్టినప్పటి నుండి టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న బీసీలు మొదటిసారి దూరమయ్యారు. దాని ప్రభావం మొన్నటి ఎన్నికల్లో బాగా పడింది. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబుకు సొంత సామాజికవర్గం తప్ప ఇతర సామాజికవర్గాలు పెద్దగా కనబడలేదనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. పేరుకు మాత్రమే టీడీపీ అంటే బీసీల పార్టీ అని చెప్పేవారు కానీ ఆచరణలో కనబడలేదు. ఇదే సమయంలో వైసీపీ గెలవటానికి బీసీల మద్దతు ఎంత అవసరమో జగన్మోహన్ రెడ్డి గుర్తించారు.
ఓ పద్దతి ప్రకారం ఎంఎల్సీ పదవులు, ఎంపిలు, ఎంఎల్ఏ టికెట్లలో బీసీలకే ప్రాధాన్యతిచ్చారు. జగన్ పై సానుకూలతతోనో లేకపోతే చంద్రబాబుపై వ్యతిరేకతతోనో వైసీపీకి అఖండ మెజారిటి దక్కింది. అధికారంలోకి వచ్చిందగ్గర నుండి జగన్ సోషల్ ఇంజనీరింగ్ ను పక్కాగా అమలు చేయటం మొదలుపెట్టారు. మంత్రివర్గంతో మొదలై తాజాగా మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపిక వరకు ఓ పద్దతి ప్రకారం అమలు చేశారు.
11 కార్పొరేషన్ల మేయర్లలో ఎనిమిది మంది బీసీలు+మైనారిటి+మహిళల+యువతనే ఎంపిక చేశారు. వీరిలో చాలామంది రాజకీయాలకే కొత్త. నిజంగానే ఇదో కొత్త ట్రెండనే చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నపుడే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ అమలుచేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ విధానం బ్రహ్మాండమనే చెప్పాలి. జగన్ ఆలోచన చూస్తుంటే భవిష్యత్తులో బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటిల్లో ఎవరు కూడా వైసీపీని వదిలి పెట్టేందుకు లేదన్నట్లుగా ఉంది.
జగన్ ఆలోచన అనుకున్నది అనుకున్నట్లుగా సాగితే టీడీపీకి భవిష్యత్తు కష్టమనే చెప్పాలి. ఎందుకంటే పై వర్గాలకు పదవులను పిలిచి మరీ ఇస్తున్న జగన్ను వదిలిపెట్టి ఇతర పార్టీల వైపు చూడాల్సిన అవసరం లేదు. ఇదే సమయంలో రాజకీయ పదవుల్లో భాగం ఇవ్వటమే కాకుండా సంక్షేమ పథకాల్లో కూడా పెద్దఎత్తున లబ్ది చేకూరుస్తున్నారు. కాబట్టి జగన్ సోషల్ ఇంజనీరింగ్ ఇప్పటికైతే బ్రహ్మాండమనే చెప్పాలి. చూద్దాం తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో దీని ప్రభావం ఎలా ఉంటుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates