తరచూ ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై పలు వర్గాల వారు ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు. ఇక.. అధికార పార్టీకి చెందిన నేతలైతే.. పూనకం వచ్చినట్లుగా అధినేత నిర్ణయాల్ని మెచ్చుకుంటుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా పార్లమెంటులో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు విన్నంతనే జగన్ సర్కారు ఇలా చేస్తుందా? అన్న భావన కలుగక మానదు.
రాష్ట్రం ఏదైనా కానీ సంక్షేమ పథకాలు ఉండాల్సిందే. దానికి తోడు డెవలప్ మెంట్ పనులు కూడా అంతే జోరుగా జరగాలి. ఏ ఒక్కటి నిలిచినా ఇబ్బందే. అయితే.. ఈ పాయింట్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరిగా అర్థం చేసుకోనట్లుగా ఉంది. తన పేరుతోనో.. తాను డిసైడ్ చేసిన పేరుతోనూ అమలు చేసే సంక్షేమ పథకాలకు కొత్త కొత్త పేర్లు పెట్టి.. వాటిని ఎప్పుడు అమలు చేస్తామన్న విషయాన్ని.. సినిమాల విడుదలకు ముందు రిలీజ్ చేసే టీజర్ల మాదిరి.. జగన్ ప్రభుత్వం విడుదల చేస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. జగన్ సర్కారు తీరు కారణంగా ఏపీలో చేపట్టాల్సిన వేలాది కోట్ల రైల్వే పనులు నిలిచిపోయిన షాకింగ్ నిజాన్ని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రాష్ట్రం తన వంతుగా ఇవ్వాల్సిన వాటాను చెల్లించిన తర్వాతే తాము పనులు మొదలుపెడతామన్నారు. ఈ సమాధానం జగన్ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కేంద్రమంత్రి ఈ మాట చెప్పటానికి కారణమైన ప్రశ్నను వేసింది మరెవరో కాదు.. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన విజయసాయి రెడ్డి.
రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వాల్సిన రూ.1636 కోట్లు ఇవ్వని కారణంగా రూ.10వేల కోట్ల విలువైన రైల్వేపనులు నిలిచిపోయినట్లుగా వెల్లడించారు. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వ తీరు కారణంగా 841కి.మీ. మేర నాలుగులైన్ల పనులు ఆగాయని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి నోట మాట విన్నంతనే విస్మయానికి గురి కావటం ఖాయం.
ఎందుకంటే..జగన్ ప్రభుత్వం అమలు చేసే చాలా సంక్షేమ పథకాలు.. ఇంతకు మించే ఖర్చు చేస్తున్నారు. అలాంటప్పుడు కేంద్రానికి ఇవ్వాల్సిన రాష్ట్రం వాటా ఇచ్చేస్తే.. ఏపీకి మరింత మేలు జరుగుతుంది కదా? అలాంటివి జగన్ ఎందుకు మర్చిపోయినట్లు? అన్నది ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సీఎంకు కళ్లు.. చెవులుగా ఉండే విజయసాయి రెడ్డి స్వయంగానే తానే ఈ ప్రశ్నను సంధించటం గమనార్హం. ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేసేలా ఈ క్వశ్చన్ చేయటం ఆసక్తికరంగా మారింది.