తెలంగాణలో రాజకీయాల్లో కొద్ది రోజులుగా ఎమ్మెల్యేల జంపింగ్‌లకు బ్రేక్ పడింది. అయితే కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ జంపింగ్‌ల పర్వం ప్రారంభం కానుందా ? అంటే అవుననే చర్చలు మొదలయ్యాయి. తెలంగాణకు మరో విపక్ష పార్టీ ఎమ్మెల్యే కారెక్కేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఒకే ఒక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు. గత సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట సీట్లే ఆ పార్టీ గెలుచుకుంది. ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పార్టీ మారిపోయారు. ఇక అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావుపై టీఆర్ఎస్ అధిష్టానం ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఆయన మాత్రం పార్టీ మారలేదు.
తాను మాత్రం ఎప్పటకీ టీడీపీలోనే ఉంటానని కూడా నాగేశ్వరరావు చెప్పారు. పరిస్థితులు ఎప్పటకీ ఒకేలా ఉండవుగా… అవసరాలు రాజకీయ నాయకులను ఎంత పని అయినా చేయిస్తాయి. నిన్నటి వరకు పార్టీ మారనని చెప్పినోళ్లు కూడా మరుసటి రోజే కండువాలు మార్చేయడం సహజం. తాజాగా ఇప్పుడు మచ్చా కూడా కారెక్కేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఆయన నేరుగా సీఎం కేసీఆర్‌తోనే టచ్‌లో ఉంటూ వస్తున్నారు. అశ్వారావుపేటలో వైసీపీకి కూడా సరైన నాయకత్వం లేదు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విషయంలో కేసీఆర్ సానుకూలంగా లేరు.
ఇక గతంలో మచ్చా నాగేశ్వరరరావుతో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఆయన్ను పార్టీలోకి లాగసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా మచ్చాతో చర్చలు జరుపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా మచ్చా అసెంబ్లీ హాల్లోనే సీఎం కేసీఆర్‌తో సుధీర్ఘంగా మంతనాలు జరపడం విశేషం. కేసీఆర్ సీట్లోనే ఆయన పక్కనూ కూర్చొన్న నాగేశ్వరరావు చెప్పిన మాటలన్నీ ఆయన సావధానంగా వింటూ ఉండడంతో పక్కనే ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయన మన పార్టీలోకి వచ్చేస్తున్నాడంటూ గుసగుసలాడుకున్నారు.
అయితే మచ్చా మాత్రం కేసీఆర్‌ను కలిశాక.. తాను తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కేసీఆర్‌తో మాట్లాడానని.. తన నియోజకవర్గంలో ఉన్న మూడు సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని కోరినట్టు చెపుతున్నారు. అయితే ఇటు ఖమ్మం జిల్లాలో… అటు గులాబీ వర్గాల్లో మాత్రం ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. మచ్చా టీడీపీలో ఉండి కూడా చేసేదేం లేకుండా పోతోంది. ఇప్పటికే రెండున్నరేళ్ల పాటు టీడీపీలో ఒంటరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇక పార్టీ వీడేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారనే తెలుస్తోంది.