ఏప్రిల్ 17వ తేదీన జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలు విచిత్రమైన పరిస్దితిని ఎదుర్కొంటున్నాయి. ఉపఎన్నిక జరుగుతుందని ఎప్పుడో తెలుసు. కాబట్టే తెలుగుదేశంపార్టీ తరపున పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా చంద్రబాబునాయుడు ఎప్పుడో ప్రకటించేశారు. వైసీపీ తరపున అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తి పోటీ చేయబోతున్నట్లు జరిగిన ప్రచారమే నిజమైంది. డాక్టర్ అభ్యర్ధిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి మంగళవారం స్వయంగా ప్రకటించారు.
బీజేపీ తరపున ఎవరు పోటీ చేసేది ఇంకా తేలలేదు. మొన్నటి వరకు బీజేపీ+జనసేనలో అసలు ఎవరు పోటీ చేయాలనే విషయంలోనే వివాదం నడిచింది. ఫైనల్ గా ఇపుడు బీజేపీనే పోటీ చేస్తుందని తేలిపోయింది కాబట్టి అభ్యర్ధి వేటలో పడింది. కాంగ్రెస్, వామపక్షాలను జనాలు అసలు పట్టించుకోవటమే లేదు. కాబట్టి వాటిగురించి మాట్లాడుకోవటం కూడా దండగే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పనబాక పేరును చంద్రబాబు ప్రకటించి సుమారు నాలుగు మాసాలైనా ఇంతవరకు ఆమె ప్రచారంలోకి దిగలేదు.
ఓడిపోయే సీటులో పోటీకి ఆమె సుముఖంగా లేరని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. చివరకు ఆమె చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చేయటం ఖాయమని నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఫలితాలు చూసి తర్వాత కూడా పనబాక పోటీ చేస్తుందనే నమ్మకమైతే చాలామంది నేతలకు లేదు. ఒకవేళ పనబాక గనుక తప్పుకుంటే అప్పుడు చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే పదిరోజుల్లో కొత్త అభ్యర్ధిని వెతకటం చాలా కష్టమని అందరికీ తెలిసిందే.
ఇక గెలిచేస్తాం..2024లో అధికారంలోకి వచ్చేస్తామని గంభీరంగా ప్రకటనలు ఇస్తున్న బీజేపీ చీఫ్ కు కూడా అభ్యర్ధిని పోటీ చేయించటం అంత ఈజీ కాదని తెలిసిపోయింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం చూసిన తర్వాత నేతలు ఎవరు పోటీకి ముందుకు రావటం లేదని సమాచారం. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటిల్లో బీజేపీకి కనీసం వందల ఓట్లు కూడా రాలేదు. దీంతోనే కమలం బలమెంతో అందరికీ తెలిసిపోయింది. హోలు మొత్తం మీద చూస్తే అభ్యర్ధుల విషయంలో ప్రతిపక్షాలు తిప్పలు పడుతున్నాయని అర్ధమైపోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates