తాడిపత్రిలో హై ఓల్టేజి టెన్షన్

రాష్ట్రంలో 75 మున్సిపాలిటిలకు ఎన్నికలు జరిగినా తాడిపత్రి రూటు మాత్రం సపరేటుగా ఉంది. తాడిపత్రి మున్సిపాలిటిలో 36 వార్డులున్నాయి. వీటిల్లో టీడీపీ 18 వార్డుల్లో గెలవగా వైసీపీ 16, సీపీఐ, ఇండిపెండెంట్ చెరో వార్డులో గెలిచారు. దాంతో రెండు ఓట్ల తేడాతో టీడీపీ ఛైర్మన్ ఖాయమనే అనుకున్నారు. అయితే ఎక్స్ అఫీషియో ఓట్లను పరిగణలోకి తీసుకుంటే వైసీపీకి మెజారిటి వచ్చేస్తుంది. కాబట్టి ఛైర్మస్ స్ధానం వైసీపీ ఖాతాలోనే పడుతుందని అనుకున్నారు.

అయితే ఇక్కడ ఎంఎల్సీల ఎక్స్ అఫీఫియో ఓట్లకు కమీషనర్ తిరస్కరించారు. ఈ తిరస్కరణ రెండుపార్టీల ఎంఎల్సీలకు వర్తిస్తుంది. టీడీపీ తరపున ఎంఎల్సీ దీపక్ రెడ్డి ఓటును తిరస్కరించిన మున్సిపల్ కమీషనర్ వైసీపీ ఎంఎల్సీలు శమంతకమణి, మొహమ్మద్ ఇక్బాల్, వెన్నపూస గోపాలరెడ్డి ఎంల్సీల ఓట్లను కూడా తిరస్కరించేశారు.

అయితే వైసీపీ తరపున గెలిచిన ఎంఎలఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపి రంగయ్యల ఓట్లు మాత్రం చెల్లుతాయన్నారు. దాంతో టీడీపీ, వైసీపీల ఓట్లు 18-18 సమానమయ్యాయి. ఈ పరిస్ధితిలో తాడిపత్రి ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది. ముందు జాగ్రత్తగా రెండు వైపుల నేతలు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఒకరి శిబిరంలోని కౌన్సిలర్లను ఆకర్షించేందుకు మరొకరు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

దీంతో తెరవెనుక జరుగుతున్న వ్యవహారాలను చక్కబెట్టేందుకు రెండు పార్టీల్లోని సీనియర్ నేతలు తాడిపత్రిలో క్యాంపు వేశారు. ఈ స్ధితిలో సీపీఐ, ఇండిపెండెంట్ కౌన్సిలర్ల పాత్రే చాలా కీలకంగా మారింది. వీళ్ళద్దరు ఎవరికి మద్దతుగా నిలిస్తే ఆ పార్టీకే ఛైర్మన్ పదవి దక్కుతుంది. మళ్ళీ వీళ్ళిద్దరు చెరోపార్టీకి మద్దతుగా నిలిస్తే టెన్షన్ కంటిన్యు అవటం ఖాయం. వైసీపీ కౌన్సిలర్లు తమతో టచ్ లో ఉన్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ప్రకటన మరింత టెన్షన్ పెంచేస్తోంది.  ఇన్ని మున్సిపాలిటిల ఫలితాలు వచ్చినా తాడిపత్రిలో మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది.