ప్రముఖ సినిమాటోగ్రాఫర్ దర్శకుడిగా మారి జీవా హీరోగా తెరకెక్కించిన కో ( తెలుగులో రంగం) సినిమా గుర్తుందా ? సమకాలీన వ్యవస్థలో కుళ్లుపోయిన రాజకీయాలను మార్చేందుకు కొందరు యువకులే నవతరం పార్టీ స్థాపించి పోటీ చేసి ఏకంగా అధికారం చేజిక్కించుకుంటారు. ఈ యువకుల్లో ఎంతో మంది ఉన్నత విద్య అభ్యసించిన వారు.. డాక్టర్లు… సాధారణ యువకులు పోటీ చేసి చట్టసభల్లోకి అడుగు పెడతారు. ఈ సినిమా కథ, కథనాలు 2011లో సౌత్‌లో పెద్ద సంచలనం రేపాయి. ఇప్పుడు అచ్చు రంగం సినిమా కథే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అవుతుందా ? అంటే అవుననే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 36 మంది యువకులు కలిపి డీఎంకే, అన్నాడీఎంకేకు చెందిన యోధాను యోధులు అయిన రాజకీయ నాయకులను ఢీకొట్టబోతున్నారు. ఈ యువశక్తి వెంట ఓ విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఆయనే వీళ్లను ముందుండి నడిపిస్తున్నారు. ఆ యువ ఐఏఎస్ అధికారి ఎవరో కాదు యు. సగాయం. కుళ్లుపోయిన రాజకీయ వ్యవస్థలో తన వంతుగా మార్పు తేవాలన్న లక్ష్యంతోనే ఆయన తమిళనాడు ఇలయంగ్ కట్చీ (టీఎన్‌ఐకే) అనే ఒక పార్టీ స్థాపించాడు. ఇందులో డాక్టర్లు, న్యాయవాదులు, ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అయిన యువకులు ఎంతో మంది ఉన్నారు. వీరిలో చాలా మంది దశాబ్దకాలం పాటు అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.
ఈ పార్టీ తరపున మొత్తం 20 అసెంబ్లీ స్థానాల్లో యువకులు పోటీ చేస్తున్నారు. కొలాత్‌పూర్, రోయాపూర్, అన్నానగర్, అవడీ, అలాందుర్, మధురవోయల్, చెంగల్‌పట్టు తదితర పట్టణ ప్రాంతాల్లో వీరు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసే సత్తా తమకు లేదని… తమను అర్థం చేసుకునే విద్యావంతులు ఉన్న పట్టణ ప్రాంతాలను మాత్రమే తాము ఎంపిక చేసుకుని.. అక్కడే తాము పోటీ చేస్తున్నామని సగాయం చెప్పారు. భవిష్యత్తులో తాము రాష్ట్రం అంతటా విస్తరిస్తామని చెప్పిన ఆయన ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయిన ఎడప్పాడిలో పోటీ చేయడం లేదని చెప్పడం గమనార్హం.
ఇక సగాయంకు నిజాయితీపరుడు అయిన ఐఏఎస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన 27 ఏళ్ల పదవీ కాలంలో అనేకసార్లు బదిలీలు జరిగాయి. ఆయన ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టించేవారు.