విజయవాడ ఎంపీ కేశినేని నాని పేరుకే టీడీపీ నేత అయినా.. కొన్నాళ్లుగా ఆయన పార్టీలో ఒంటరిగానే ఉంటున్నారు. ఎవరినీ కలుపుకొని పోవడం లేదనే విమర్శలు ఆయనను చుట్టుముడుతున్నాయి. అదే సమయంలో ఇతర నేతలు కూడా ఆయనను కలుపుకొని పోయేందుకు ముందుకు రావడం లేదు. ప్రధానంగా ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా.. సహా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వంటివారు కూడా కేశినేనికి దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామాలతో ఇప్పటికే ఆయన ఒంటరయ్యారనే టాక్ ఇటు పార్టీలోను, అటు జనాల్లోనూ వినిపిస్తోంది.
ఇక, ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలను కేశినేని నాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎంపీ ఎన్నికల తరహాలో తనే స్వయంగా రంగంలోకి దిగి.. పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్రలు కూడా చేశారు. ఆయన కుమార్తె శ్వేతకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. వ్యతిరేకతలు వచ్చినా విజయవాడ మేయర్ పీఠాన్ని ఇప్పించుకున్నారు. అయితే.. ఇప్పుడు ఇక్కడ గెలుస్తారా? అనేది ప్రధానంగా వెంటాడుతున్న ప్రశ్న. ఇక్కడ కనుక గెలుపు గుర్రం ఎక్కలేక పోతే.. కేశినేని హవా పూర్తిగా సన్నగిల్లుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో అట్టుడుకుతున్న విజయవాడ టీడీపీలో కేశినేని కుమార్తె మేయర్ పీఠం దక్కించుకోలేక పోతే.. ఆయనను పార్టీ నేతలు మరింత దూరం పెడతారు.
ఇక, కేశినేని గెలిస్తే.. విజయవాడలో ఆయన దూకుడు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. తనకంటూ ఇప్పటికే ఒక వర్గం ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్న కేశినేని.. రేపు కనుక ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఆ వర్గానికి మరింత ప్రాధాన్యం పెరగడంతోపాటు.. ఇతర నేతలను మరింత దూరం పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ఆయనపై ఆగ్రహంతో ఉన్న నాయకులు .. కేశినేని వైఖరిని జీర్ణించుకుంటారా? పార్టీలోనే కొనసాగుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates