బీజేపీకి దాదానే దిక్కా ?

పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీని ధీటుగా ఎదుర్కోవటానికి ప్రముఖ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవౌ గంగూలీనే దిక్కుగా మారాడా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. గంగూలి అలియాస్ దాదా కు బీజేపీ పెద్దలతో బాగా సన్నిహిత సంబంధాలున్న విషయం యావత్ ప్రపంచానికి బాగా తెలుసు. గంగూలీ కమలంపార్టీలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతున్నదే.

అయితే ఆమధ్య దాదాకు రెండుసార్లు గుండెపోటు రావటంతో డైరెక్టుగా బీజేపీలో చేరిక ఆలస్యమైంది. అనారోగ్య సమస్యలు తలెత్తకపోతే ఈపాటికే ప్రచారంలోనో లేకపోతే ఎక్కడి నుండో పోటీ చేస్తునో బిజీగా ఉండేవాడే అనటంలో సందేహం లేదు. అయితే గుండెపోటు వచ్చిన తర్వాత రెండుసార్లు స్టంటు వేసుకున్న తర్వాత ఇపుడు ఆరోగ్యంగానే ఉన్నారు. కాబట్టి గంగూలీని ముందుగా ప్రచారంలోకి దింపాలని బీజేపీ పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మమతను ఎదుర్కొనేందుకు బీజేపీకి ఇప్పటికీ దీటైన ప్రత్యర్ధి లేరా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటికే 29 మంది ఎంఎల్ఏలను, ఒక ఎంపితో పాటు అనేకమంది సీనియర్ నేతలను బీజేపీలోకి లాక్కున్నారు. వీరిలో నందిగ్రామ్ ప్రాంతంలో బలమైన పట్టున్న సుబేందు అధికారి లాంటి నేతలు కూడా ఉన్నారు. అయినా గంగూలీతో చర్చలు జరిపి ఒత్తిడి పెట్టి రంగంలోకి దింపాల్సిన అవసరం బీజేపీకి ఏమోచ్చింది ?

అంటే బీజేపీలో ఇపుడున్న నేతలు కానీ లేదా టీఎంసీ నుండి లాక్కున్న నేతలకు కానీ మమతను ఢీకొనే సత్తా లేదని నరేంద్రమోడి, అమిత్ షా భావిస్తున్నట్లే ఉన్నారు. ఇందుకే వెంటనే రంగంలోకి దిగాలంటూ దాదాతో పదే పదే బీజేపీ అగ్రనేతలు చర్చలు జరుపుతున్నారు. మొత్తంమీద అగ్రనేతల వ్యవహారం చూస్తుంటే మమతను ఢీకొనే సత్తా బీజేపీలో లేరని డిసైడ్ అయినట్లు అర్ధమైపోతోంది. గంగూలీకి కూడా తన రాజకీయ ప్రవేశంపై డైరెక్టుగా ఏమీ చెప్పలేదు. తన జీవితంలో జరిగిన పరిణామాలన్నీ హఠాత్తుగా సంభవించినవే అని నర్మగర్భంగా చెప్పటం గమనార్హం.