జగన్ కి అంతా తెలుసు అని మరోసారి కన్ ఫం చేసిన కేంద్రం

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ అంశం.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు తెలిసే జ‌రుగుతోంద‌ని మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై వైసీపీ నాయ‌కులు చెప్పిన మాట‌లు, చేస్తున్న ప‌నులు ఈ ప‌రిణామంతో అంతా మాయేన‌ని స్ప‌ష్ట‌మైంది. ప్ర‌భుత్వం ఉన్న‌ది వ్యాపారం చేసేందుకు కాదంటూ.. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించే ప్ర‌క్రియ‌ను కేంద్రం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ కూడా ఉండ‌డం.. ఏపీ ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా క‌ల‌చి వేసింది. ఎంతో మంది త్యాగాలు, 36 మంది ప్రాణ‌త్యాగంతో ఏర్ప‌డిన ఈ విశాఖ క‌ర్మాగారం.. ఆంధ్రుల హ‌క్కుగా ఉంద‌ని.. పేర్కొంటూ.. ప్ర‌జ‌ల నుంచి ఉద్య‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి.

అయితే.. ఈ విష‌యంలో అధికార ప‌క్షం వైసీపీ.. అనేక మాట‌లు చెప్పింది. తాము దీనిని వ్య‌తిరేకిస్తామంటూ.. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఏకంగా పాద‌యాత్ర చేశారు. అక్క‌డ ఉద్య‌మిస్తున్న కార్మికుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇక‌, సీఎం జ‌గ‌న్ కూడా దీనిపై కార్మిక సంఘాల‌తో చ‌ర్చించి.. ఉక్కు విష‌యంలో వెన‌క్కి త‌గ్గేలా చూస్తామ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి సుదీర్ఘ లేఖ రాశారు. శాశ్వ‌త గ‌నులు కేటాయించ‌డం.. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను షేర్ మార్కెట్‌లో పెట్ట‌డం ద్వారా.. లాభాల బాట ప‌ట్టించ వ‌చ్చంటూ.. పేర్కొన్నారు. దీనిని బ‌ట్టి అస‌లు త‌మ‌కు ఏమీ తెలియ‌ద‌ని.. ఉక్కు నిర్ణ‌యం అంతా కేంద్రానిదేన‌ని.. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. తాజాగా ఈ ఉక్కు ప‌రిశ్ర‌మ విష‌యంపై పార్ల‌మెంటులో విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రిస్తున్నారా? అన్న ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. స‌మాధానం చెప్పారు. స్టీల్‍ప్లాంట్‍లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్లాంట్‍లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవని తెలిపారు.

అదే స‌మ‌యంలో విశాఖ ఉక్కు అమ్మ‌కం పై జగన్ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామ‌ని ఆమె సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు, అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరిన‌ట్టు కూడా నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌, ఆయ‌న ప్ర‌ధాని మోడీకి రాసిన లేఖ కేవ‌లం మొస‌లి క‌న్నీరేన‌ని స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.