జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియంలో గంటలు కొట్టే చిలక గంటకోసారి వచ్చినట్లు తయారైంది పవన్ వ్యవహారం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉద్దేశించి తాజాగా జనాలకు అధినేత ఓ సందేశాన్ని పంపించారు. దాని ప్రకారం వైసీపీ ఎంపిలు నాటకాలు ఆడుతున్నారట. డిల్లీలో పోరాటాలు చేయాల్సింది పోయి విశాఖ వీధుల్లో పోరాటాలు చేయటం ఏమిటి ? నిలదీశారు.
కేంద్రాన్ని నిలదీయలేని అధికార పార్టీ 22 ఎంపిలు పార్లమెంటులో చేయాల్సిన పోరాటాలను విశాఖలో చేస్తున్నట్లు నిందించారు. విశాఖలో పోరాటాలు చేయటానికి తామున్నామని దీనికి వైసీపీ ఎంపీలు అవసరం లేదని తేల్చేశారు. తమకు పార్లమెంటులో బలం లేదు కాబట్టి వీధిలో పోరాటాలు చేస్తున్నామన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ పవన్ చాలా తెలివిగా మాట్లాడుతున్న విషయం అర్ధమవుతోంది.
జనసేనకు పార్లమెంటులో బలం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బీజేపీకి జనసేన మిత్రపక్షమన్న విషయం కూడా అందరికీ గుర్తుంది. విశాఖ ఉక్కు పై పార్లమెంటులో లేవనెత్తాల్సిన బాధ్యత వైసీపీ, టీడీపీ ఎంపిలకు ఎంతుందో కేంద్రంతో మాట్లాడాల్సిన బాధ్యత జనసేనపైనా అంతే ఉంది. ఎందుకంటే వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీకి మిత్రపక్షాలు కావు. వైసీపీ+టీడీపీలకు ఎంపిల బలం ఉంటే, జనసేనకు మిత్రపక్షమన్న హోదా ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంపిలు విశాఖ ఉక్కుపై కేంద్రాన్ని నిలదీస్తున్నారు. కానీ బీజేపీ మిత్రపక్షంగా జనసేన ఏమి చేస్తోందనే విషయాన్ని పవన్ ఎక్కడా మాట్లాడలేదు. పవన్ను బీజేపీ ఏమాత్రం పట్టించుకోవటం లేదన్న విషయం అనేకసార్లు నిరూపితమైంది. ఎన్ని రోజులు ఢిల్లీలో కూర్చున్నా ప్రధానమంత్రి నరేంద్రమోడి కనీసం అపాయిట్మెంట్ కూడా పవన్ కు ఇవ్వటం లేదు. బడ్జెట్లో ఏమీ ఇవ్వకపోయినా పవన్ బీజేపీని నిలదీయకపోగా ప్రశంసిస్తున్నారు. బంధాన్ని ఉంచుకోవాలో తెంచుకోవాలో తెలియని దిక్కుతోచని స్ధితిలో ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates