ఐదు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు అవకాశాలెన్ని?

తమకు ఏ మాత్రం సంబంధం లేని ఐదు రాష్ట్రాల ఎన్నికల తీర్పుపై దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెట్రో ధరల మంట.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరు.. ఇటీవల కాలంలో మోడీ ఇమేజ్ దెబ్బ తిందన్న వార్తలు.. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పాగా వేయాలని బీజేపీ బలంగా అనుకుంటున్న రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆయా రాష్ట్రాల ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్న విజయవకాశాల్ని చూసే ముందు.. ప్రస్తుతం ఆ ఐదు రాష్ట్రాల్లో ఏయే పార్టీలు అధికారంలో ఉన్నాయన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ అధికారంలోకి వస్తే.. తమిళనాడులో అన్నాడీఎంకే (దివంగత సీఎం జయలలిత సారథ్యంలో) అధికారంలోకి వచ్చింది. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ (పొత్తుతో) పవర్లోకి వచ్చింది. కేరళలో వామపక్షవాదులు అధికారంలో ఉన్నారు. అసోంలో బీజేపీ పవర్లో ఉంది అంటే..ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది ఒక్క అసోంలోనే. ఇక.. ఈ ఎన్నికలకు మరో ప్రత్యేకత ఏమంటే.. 116ఎంపీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నట్లుగా చెప్పాలి. ఇప్పుడొచ్చే ఫలితం మోడీ సర్కారు మీద ప్రభావం చూపటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. రాష్ట్రాల వారీగా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే..

పశ్చిమ బెంగాల్
ఇప్పుడు అందరి చూపు ఈ రాష్ట్రం మీదనే. మమతకు చెక్ పెట్టి బీజేపీ పాగా వేయాలని భావిస్తోంది. ఇందుకోసం భారీ ఎత్తున కసరత్తు చేస్తుంది. ఎంత ప్రయత్నించినా తమకు అందని ద్రాక్షలా ఊరిస్తున్న బెంగాల్ కోట మీద కాషాయ జెండా ఎగురవేయాలని బలంగా కాంక్షిస్తుంది. ఇదిలా ఉంటే.. కమలనాథుల్ని కంట్రోల్ చేయటం.. బెంగాల్ లో వారి పప్పులు ఉడకవన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలని సీఎం మమత ప్రయత్నిస్తున్నారు. 2011లో 4 శాతం ఓట్లతో మొదలైన ఆమె ప్రయాణం 2016 ఎన్నికల్లో 10 శాతానికి పెంచుకొని చివరకు బెంగాల్ కోటను సొంతం చేసుకొన్నారు. రెండు దఫాలుగా తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్న ఆమె.. ముచ్చటగా మూడోసారి తన అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తున్నారు.
అయితే.. అదంత సులువు కాదని చెబుతున్నారు. బీజేపీ తన సర్వశక్తుల్ని ఒడ్డుతోంది. బలమైన ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. మరింతగా విస్తరించొచ్చన్న ఆలోచనలో ఉంది. బెంగాల్ లోని 27 శాతం ముస్లిం జనాభా ఓటింగ్ మీదనే మమత ఆశలన్నీ. వాటిని ఎంతలా చీల్చగలిగితే.. ఆమె విజయవకాశాలు అంతగా తగ్గిపోతాయి. ఇదిలా ఉంటే.. బెంగాలీ బిడ్డనన్న మమత మాట భావోద్వేగంగా మారి బెంగాలీలు ఒక నిర్ణయానికి వస్తే.. బీజేపీకి మరోసారి ఆశా భంగం కలుగక తప్పదు. పోటాపోటీగా ఉన్న ఈ రాష్ట్రంలో విజయం ఎవరిదన్న మాట వెంటనే చెప్పటం కష్టం.

తమిళనాడు
అధికార పక్షం విపక్షంగానూ.. విపక్షం అధికార పక్షంగా మారే సంప్రదాయం తమిళనాడులో ఉంటుంది. అలాంటి తీరును బ్రేక్ చేశారు జయలలిత. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీగా బరిలోకి దిగిన అన్నాడీఎంకే అనూహ్య విజయాన్ని సాధించారు. ఐదేళ్ల వ్యవధిలో తమిళనాడుకు రాజకీయ పెద్దలుగా ఉన్న కరుణానిధి.. జయలలితలు మరణించటం.. వారిద్దరూ లేకుండా జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలుగా వీటిని చెప్పాలి. అధికార అన్నాడీఎంకే అంతర్గత పోరుతో కిందామీదా పడుతోంది. మరోవైపు విపక్ష డీఎంకే ఈసారి ఎలా అయినా అధికారం తమ సొంతం కావాలన్న పట్టుదలతో పని చేస్తోంది. మరోవైపు అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ.. అధికారాన్ని సమంగా పంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం డీఎంకేకు తమిళనాడులో విజయవకాశాలు ఎక్కువగా చెబుతున్నారు.

అసోం
2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అనూహ్యంగా ఓడించిన బీజేపీ.. తొలిసారి ఆ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకుంది. అయితే.. ఆ గెలుపు ఏదో గాలివాటంగా వచ్చింది కాదని.. దానికి బలమైన కారణాలు ఉన్నాయన్న విషయాన్ని తాజా ఎన్నికల ఫలితాలతో నిరూపించాలన్న పట్టుదలతో పార్టీ ఉంది. అయితే.. జాతీయ పౌర పట్టిక.. పౌరసత్వ సవరణ చట్టం లాంటివి రాష్ట్రంలో ఆందోళనకు గురి చేశాయి. బీజేపీపై వ్యతిరేకత పెరిగేలా చేశాయి. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా లేకపోవటం కమలనాథులకు కలిసి వచ్చే అంశం. దాదాపుగా ఈ రాష్ట్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అనూహ్యంగా తెప్పరిల్లి బలోపేతం అయితే ఫలితం మారే వీలుంది.

కేరళ
కాంగ్రెస్ తీరును తప్పు పట్టే వారికి కేరళ ఒక చక్కటి ఉదాహరణగా చెబుతారు. పశ్చిమబెంగాల్ లో వామపక్ష వాదులతో కలిసి పోటీ చేస్తున్న ఆ పార్టీ.. కేరళలో మాత్రం అందుకు భిన్నంగా ప్రత్యర్థులుగా తలపడటం గమనార్హం. గడిచిన నలభై ఏళ్లుగా కేరళలో ఒక సంప్రదాయం ఉంది. ఒకసారి వామపక్ష సారథ్యంలోప్రభుత్వం ఏర్పాటైతే.. తర్వాతి సారి కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి విషయం సాధించటం మామూలే. అయితే.. బీజేపీ ఈసారి కేరళలో పాగా వేయాలని భావిస్తోంది. కోవిడ్.. వరదల విషయంలో ప్రభుత్వం బాగానే స్పందించినట్లుగా చెబుతున్నా.. ఇటీవల కాలంలో పెరిగిన కేసులు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందంటున్నారు. వీలైనంతవరకు ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. బీజేపీ ఎంతలా ప్రయత్నించినా.. వారి కల కలగానే మిగులుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పుదుచ్చేరి
ఈ కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీకిఅంత బలం లేదు. కానీ.. కాంగ్రెస్ లోని అంతర్గత గొడవల్ని కేంద్రంలో తనకున్న బలంతో ప్రభుత్వాన్ని మార్చగలిగింది. అయితే.. ఎన్నికల్లో ఏ పార్టీకైనా స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో.. ఇటీవల ఎలాంటి పరిణామాలుచోటుచేసుకున్నాయో.. అలాంటివే మరోసారి చోటు చేసుకునే వీలుంది.