దేశంలోని వివిధ ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మంచి జోరు మీదుంది. తాజాగా జరిగిన మ్యారిటైమ్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోడి మాట్లాడుతు దేశంలోని మేజర్ పోర్టులను ప్రైవేటీకరించబోతున్నట్లు చెప్పారు. అలాగే వీటి ఆధ్వర్యంలో నడుస్తున్న 39 బెర్తులను 2024 ఏడాది చివరకల్లా ప్రైవేటు సంస్ధలతో బాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు స్పష్టం చేశారు.
పోర్టులను ప్రైవేటీకరిచటానికి వీలుగా కేంద్రం తొందరలోనే ప్రైవేటుపోర్టుల అథారిటి చట్టాన్ని అమల్లోకి తేబోతోంది. ఇందులో అనేక పోర్టులతో పాటు విశాఖ పోర్టు కూడా ఉందని సమాచారం. ఇప్పటికే విశాఖ ఉక్కును ప్రైవేటు సంస్ధకు అప్పగించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో గడచిన నెలరోజులకు పైగా విశాఖ నగరంలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయం వెలుగు చూడగానే ఫ్యాక్టరీలోని ఉద్యోగులు, కార్మికులతో మొదలైన ఆందోళనకు రాజకీయపార్టీలు కూడా తోడయ్యాయి.
అయితే రాజకీయపార్టీలు ఎన్ని ఆందోళనలు చేసినా పెద్దగా ఉపయోగం కనబడటం లేదు. ఎందుకంటే ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగానే మరోవైపు ప్రైవేటు కంపెనీకి అప్పగించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఉక్కు ప్రైవేటీకరణ ఆగేట్లులేదు. ఒకవైపు ఇది జరుగుతుండగానే తాజాగా విశాఖ పోర్టును కూడా ప్రైవేటుపరం చేయటానికి ఏర్పాట్లు మొదలైందని సమాచారం.
కేంద్రం 2020లోనే మేజర్ పోర్టుల అథారిటి చట్టాన్ని తెచ్చింది. ఇందులో భాగంగానే ఇఫ్పటికే పోర్టుల్లోని కార్యకలాపాలన్నీ కేంద్రం చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ఇపుడు ప్రాజెక్టుల్లోని ప్రాజెక్టులన్నింటినీ ప్రైవేటు భాగస్వామ్యానికి అప్పగించాలని తాజాగా డిసైడ్ అయ్యింది. చట్టంలో భాగంగానే పోర్టులోని వివిధ విభాగాల నిర్వహణకు ప్రైవేటు భాగస్వామ్య కంపెనీలు తగిన రుసుములు వసూలు చేయబోతున్నాయి. ఆదాయ, వ్యయాలను వివిధ దామాషాల్లో పంచుకుంటాయి. ఇపుడు ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యం అంటున్నా మెల్లిగా ప్రభుత్వం తప్పుకుని మొత్తాన్ని ప్రైవేటుకు అప్పగించేస్తుంది.