ఆసక్తికరంగా మారిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల మీద ప్రభావాన్ని కచ్ఛితంగా చూపించనున్నాయి. భవిష్యత్ రాజకీయాల్ని దిశానిర్దేశం చేసే ఈ ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి వేళ.. ఒక ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఒపీనియన్ పోల్ వివరాల్ని వెల్లడించారు. ఉత్తరాదిన పేరున్న ఆనంద్ బజార్ పత్రిక.. సీ ఓటర్ అనే రెండు సంస్థలు కలిసి ఒపీనియన్ పోల్ నిర్వహించారు. దీని ప్రకారం పశ్చిమబెంగాల్ లో దీదీకి హ్యాట్రిక్ విజయం ఖాయమని తేలుస్తున్నారు. అంతేకాదు తమిళనాడులో స్టాలిన్ కాబోయే ముఖ్యమంత్రిగా చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే.. ఈ ఎన్నికల పుణ్యమా అని జాతీయ పార్టీలైన బీజేపీ.. కాంగ్రెస్ లు పెద్దగా లాభపడేది ఏమీ ఉండదంటున్నారు. కొంతలో కొంత దక్షిణాదిన మరో రాష్ట్రంలో బీజేపీ పవర్లోకి వచ్చే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. రాష్ట్రాల వారీగా ఓపినీయన్ పోల్ లో వ్యక్తమైన విషయాల్ని చూస్తే..
- పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ 148 నుంచి 164 సీట్లను సాధించి మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకోవటం ఖాయమంటున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీకి 92 నుంచి 108 సీట్ల వరకు సొంతం చేసుకునే వీలుందని చెబుతున్నారు. కాంగ్రెస్ -వామపక్షాలకు మరోసారి ఎదురుదెబ్బ తప్పదని.. వారికి 31- 39 సీట్లు మాత్రమే వచ్చే వీలుందంటున్నారు.
- తమిళనాడు విషయానికి వస్తే.. అన్నాడీఎంకేతో జత కట్టిన ఎన్డీయే కూటమికి భారీ దెబ్బ తగలటం ఖాయమని చెబుతున్నారు. డీఎంకే లీడ్ చేసే యూపీఏ కూటమికి అత్యధిక స్థానాల్ని సొంతం చేసుకొని అధికారంలోకి వస్తుందంటున్నారు. యూపీఏకు 154-162 సీట్ల మధ్యన వస్తే.. అన్నాడీఎంకే కూటమికి 58-62 సీట్లు మాత్రమే వస్తాయనట. కమల్ హాసన్ పార్టీ కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపదని తేల్చారు.
- కేరళలో మరోసారి కమ్యునిస్టులే అధికారాన్ని చేపట్టే వీలుందని చెబుతున్నారు. సీపీఎం లీడ్ చేసే లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 83 నుంచి 91 సీట్లు వచ్చే చాన్స్ ఉందని.. కాంగ్రెస్ లీడ్ చేసే యూడీఎఫ్కు 47-55 సీట్లు వచ్చే వీలుందని చెబుతున్నారకు. బీజేపీకి రెండుస్థానాలకు మించి రావట.
- అసోంలో మాత్రం అధికార ఎన్డీయే కూటమి 43 శాతం ఓట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తేల్చారు. యూపీఏ కూటమికి 47 సీట్లకు పరిమితమయ్యే వీలుంది.
- ఆసక్తికరంగా పుదుచ్చేరి ఫలితాలు ఉంటాయంటున్నారు. అధికార కాంగ్రెస్ కు బలమైన ఎదురుదెబ్బ తగలనున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 17-21 సీట్లు వచ్చే వీలుందని.. కాంగ్రెస్ కు బలంగా దెబ్బ తగిలే అవకాశమే ఎక్కువట.