మిత్రపక్షాలైన బీజేపీ-జనసేన మధ్య విశాఖ ఉక్కు పెద్ద చిచ్చు పెట్టినట్లు సమాచారం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పొత్తుల విషయంలో తాము పునరాలోచించాల్సుంటుందని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ డైరెక్టుగానే హెచ్చరించారు.
అయితే నాదెండ్ల హెచ్చరికలను కేంద్రం ఏమాత్రం ఖాతరుచేయలేదు. ఎందుకంటే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం మరింత జోరు పెంచింది. ప్రైవేటీకరణ అంశం జోరుగా, సజావుగా జరిగేందుకు మంత్రిత్వ శాఖలతో కమిటిని వేసింది. ఉక్కు ప్రైవేటీకరణ అంశం నుండి వెనక్కు వెళ్ళేది లేదన్నట్లుగా తాజాగా కేంద్ర మరో ప్రకటన చేసింది. తాజా ప్రకటనతో బీజేపీకి మిత్రపక్షంగా ఉండాలో వద్దో తేల్చుకోవాల్సింది జనసేన మాత్రమే.
కేంద్రం తాజా వైఖరి ఒక్క తిరుపతి లోక్ సభ ఉపఎన్నికతో పోయేదికాదు. మరో మూడున్నరేళ్ళు రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వెంటాడుతునే ఉంటుంది. చూడబోతుంటే రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అయ్యే అవకాశాలు లేవని బీజేపీ అగ్రనేతలు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లే అనిపిస్తోంది. అందుకనే 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ మీద దెబ్బ కొడుతునే ఉంది.
కేంద్రం వైఖరిని కవర్ చేసుకోవటానికి ఇంతకాలం బీజేపీ నేతలు ఏవో కథలు చెబుతు కాలం నెట్టుకొచ్చేశారు. కానీ తాజాగా ఉక్కు ప్రైవేటీకరణ కారణంగా వాళ్ళు చెబుతున్నవి అబద్ధాలని అందరికీ తెలిసిపోయింది. దాంతో సోమువీర్రాజు అండ్ కో కూడా ఏమి మాట్లాడలేక జనాలకు మొహం చాటేస్తున్నారు. అందుకనే తాము చెప్పదలచుకున్న విషయాలను ట్విట్టర్ కే ఎక్కువ పరిమితమైపోయారు. కేంద్రం తాజా ప్రకటనతో జనసేన నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందో చూడాల్సిందే.