పార్టీకి కొత్తరక్తం ఎక్కిస్తాను..మూడు రోజుల కుప్పం పర్యటనలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలివి. నిజానికి పార్టీకి కొత్తరక్తం ఎక్కించాల్సిన అవసరం దాదాపు పదేళ్ళ క్రితమే వచ్చేసింది. కానీ ఇప్పటికీ ముసలి రక్తంతోనే బండిని లాగిస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి కొత్తరక్తం మాటను ఇప్పటికి కొన్ని వందలసార్లు చెప్పుంటారు. కానీ ఒక్కసారికూడా కొత్త రక్తం ఎక్కించే సాహసం చేయలేకపోయారు.
అప్పుడెప్పుడో 1982లో ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు యువకులుగా పార్టీలో చేరిన వారితోనే ఇఫుడు కూడా చంద్రబాబు రాజకీయాలు కానీచ్చేస్తున్నారు. అప్పట్లో 30ల్లో ఉన్న నేతలకు ఇపుడు 70ల్లోకి చేరుకున్నారు. అయినా వాళ్ళు పక్కకు పోరు కొత్తవాళ్ళని రానివ్వరు. చివరకు చంద్రబాబు కూడా కొత్తవారిని తీసుకురావటంలో ఫెయిలవుతున్నారు.
ఒకవేళ ఎవరైనా కొత్తరక్తం వచ్చారని అనుకుంటే అది కచ్చితంగా సీనియర్ల వారుసులే అయ్యుంటారనటంలో సందేహం లేదు. చింతకాయల అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, బండారు సత్యనారాయణమూర్తి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కేఈ కృష్ణమూర్తి, పరిటాల సునీత, జేసీ బ్రదర్స్ లాంటి సీనియర్ నేతల పిల్లలే కొత్తరక్తంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. వీళ్ళ ప్రధాన అర్హత వారసత్వమే కానీ ఇతరత్రా ఏమి ఉందో ఎవరికీ తెలీదు.
ఇలా కాకుండా పార్టీలో పనిచేస్తున్న చురుకైన యువనేతలను గుర్తించి వారికి చంద్రబాబు మద్దతుగా నిలబడి ప్రోత్సహిస్తే మంచి నాయకత్వం తయారయ్యే అవకాశాలు టీడీపీలో పుష్కలంగా ఉంది. కానీ ఆ అవకాశాన్ని చంద్రబాబు తనంతట తానే చెడగొట్టుకుంటున్నారు. యువరక్తం, కొత్తరక్తం అంటే సీనియర్ల వారసులనే ముద్ర పడిపోయింది. సీనియర్లు+వారసులు పక్కకు వెళ్ళరు, చంద్రబాబు కూడా వాళ్ళని కాదని ఏమీ చేయలేని పరిస్దితిలో ఉన్నారు.
కాబట్టి కుప్పంలో చంద్రబాబు చెప్పినట్లు కొత్తరక్తం ఎక్కించే విషయాన్ని పార్టీలోనే లైటుగా తీసుకుంటున్నారు. కారణం ఏమిటంటే ఇప్పటికీ మాటను చాలాసార్లు చంద్రబాబు చెప్పుండటమే. ఇప్పటికైనా కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో చూపిస్తేనే పార్టీ బలోపేతమవుతుంది లేకపోతే అంతే సంగతులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates