సీఎం జగన్ కు ఎంపీ రఘురామ ఫోన్.. ఏం జరిగింది?

ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. సొంత పార్టీ అధినేతతో సున్నం పెట్టుకున్న ఆయన తరచూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేయటం.. పార్టీని ఇరుకున పెట్టటం మామూలే. గడిచిన కొద్దికాలంగా నియోజకవర్గానికి దూరంగా ఢిల్లీలోనే ఉంటున్న ఆయన.. తాజాగా తన నియోజకవర్గ పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. తన పర్యటన సందర్భంలో ఏదోలా అరెస్టు చేయాలన్న ఆలోచనలో సొంతపార్టీ నేతలు ఆలోచిస్తున్నారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాను వస్తున్నట్లు తెలిస్తే.. తన నియోజకవర్గం నుంచి 500 కార్లు విమానాశ్రయానికి వస్తాయన్న సమాచారం నిఘా వర్గాల రిపోర్టును ఒక డీఎస్పీ స్థాయి అధికారి సీఎంకి చేరవేశారు. అనంతపురం జిల్లాలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏ రీతిలో అయితే అనని మాటలు అన్నారని చెప్పి జైల్లో పెట్టారో.. అక్కడే కరోనా తగిలించారో చూశామని.. తన విషయంలోనూ అలానే చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆరోపించారు.

ముఖ్యమంత్రి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆయనకు తమ జిల్లాకు చెందిన మంత్రి తోడ్పాటు ఉందన్నారు. సొంత పార్టీకి చెందిన ఎంపీని నియోజకవర్గానికి వెళ్లకుండా చూస్తుంటే ముఖ్యమంత్రి ప్రశ్నించకపోవటం ఏమిటని ప్రశ్నించారు. తాను సీఎం జగన్ తో మాట్లాడేందుకు శుక్రవారం నుంచి ప్రయత్నిస్తుంటే ఫోన్ లైన్ లోకి రాకపోవటం దారుణమన్న ఎంపీ రఘురామ.. సీఎం దగ్గర ఎంత మొత్తుకున్నా అరణ్యరోదనలా ఉందన్నారు.

మంత్రి రంగనాథ రాజులుపై చర్యలు తీసుకొని తాను నియోజకవర్గానికి వెళ్లేలా చూడాలన్నారు. ఒకవేళ.. అలాంటి పరిస్థితి లేకపోతే.. తానీ విషయంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే లోపు తనకు సరైన సమాధానం రాకపోతే.. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని.. ఇది రాష్ట్రానికి.. ముఖ్యమంత్రికి మంచిది కాదన్న హెచ్చరిక చేవారు. మరి.. దీనికి ఏపీ అధికారపక్షం ఎలా స్పందిస్తుందో చూడాలి.