మోడీ ఎఫెక్ట్.. బెంగాల్‌లో 8 విడ‌త‌లుగా ఎన్నిక‌లు!!

కొన్ని కొన్ని నిర్ణ‌యాల వెనుక… చాలా చాలా కీల‌క‌మైన విష‌యాలు దాగి ఉంటాయి. మ‌రీ ముఖ్యంగా రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా మేనేజ్ చేయ‌గ‌లుగుతున్నార‌నే వాద‌న‌లు ఉన్న నేటి రోజుల్లో ఎక్క‌డ ఎలాంటి ప‌రిణామాలు.. భిన్నంగా చోటు చేసుకున్నా.. ఒకింత అనుమానంతోనే చూడాల్సిన ప‌రిస్థితులు నేడు నెల‌కొన్నాయి. తాజాగా జ‌రిగిన ప‌రిణామం వెనుక కూడా ఇలాంటి అనుమానమే వ్య‌క్త‌మ‌వుతోంది. వాస్త‌వానికి ఇలాంటి అనుమానాలు రానేకూడ‌దు.. కానీ.. ప‌రిస్తితులు.. ప‌రిణామాలు మాత్రం అనుమానాలు ప‌డేలా చేస్తున్నాయి. ప్ర‌ధానంగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు దృష్టి.. ప్ర‌ణాళిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. జ‌రుగుతున్న ప‌రిణామాలు వారికి అనుకూలంగా ఉన్నాయా? అనే సందేహాల‌ను బ‌ల‌పడేలా చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

8 విడ‌త‌లుగా..
తాజాగా పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరానికి నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా 8 విడతల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 శాసన సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. మార్చి 27 నుంచి ఎనిమిది దశల్లో జరుగనున్న ఎలక్షన్‌ ఫలితాలు మే 2న వెలువరించనున్నట్లు తెలిపింది. వాస్తవానికి 2016లో జ‌రిగిన ఎన్నిక‌లు కూడా ఏడు విడ‌త‌లు జ‌రిగాయి. కానీ, అప్ప‌ట్లో ఎలాంటి అనుమానం ఎవ‌రికీ రాలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం అనుమానాలు పెరుగుతున్నాయి.

బీజేపీ క‌న్ను.. బెంగాల్‌పై..
పశ్చిమ బెంగాల్‌లో పొలిటికల్‌ హీట్‌ తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వ‌ర్సెస్ బీజేపీ మ‌ధ్య నిప్పుల రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే వివిధ రకాల సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ మరోసారి స‌ర్కారు ను ఏర్పాటు చేసుకునే దిశ‌గా మ‌మ‌త ప‌రుగులు పెడుతున్నారు. అదేస‌మ‌యంలో అభివృద్ధి కావాలో… అవినీతి, కట్‌ మనీ కల్చర్‌ కావాలో తేల్చుకోండి అంటూ బీజేపీ ప్రచార దూకుడు పెంచింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా బీజేపీ ప్రధాన నేతలంతా బెంగాల్‌లో పర్యటిస్తూ మమత సర్కారుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.

అందుకే .. ఈ నిర్ణ‌య‌మా?
ఇక‌, కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకు కంట్లో న‌లుసు, పంటి కింద రాయిగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే.. అది బెంగాల్ మాత్ర‌మే. అక్క‌డి ముఖ్య‌మంత్రి మ‌మ‌త మాత్ర‌మే. ఈమెను రాజ‌కీయంగా అడ్డు తొలగించుకుంటే.. ఇక‌, దేశంలో బీజేపీని ఎదిరించే నాయ‌కుడు(కేజ్రీవాల్ ఉన్నా కేసుల్లో ఇరికించేశారు) లేరు. ఈ నేప‌థ్యంలో బెంగాల్ గెలుపు కోసం.. బీజేపీ తీవ్రంగా శ్ర‌మిస్తోంది. అయితే.. ఎన్నిక‌లు వేగంగా జ‌రిగితే.. ప్ర‌చారాన్ని క్షేత్ర‌స్థాయిలోకి తీసుకువెళ్లే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా విభ‌జించి.. ప్ర‌చారం చేయ‌డం అనే సూత్రం పాటించ‌డం క‌ష్ట‌సాధ్యం. అందుకే.. ఇక్క‌డ సాధ్య‌మైన‌న్ని ఎక్కువ విడ‌త‌లు ఉండేలా కేంద్రం ఆది నుంచి చ‌ర్య‌లు తీసుకుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈసీని టెక్నిక‌ల్‌గా ఒప్పించారా?!
రాజ్యాంగ వ్య‌వ‌స్థ అయిన కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని త‌ప్పుప‌ట్ట‌క‌పోయినా.. తాజా నిర్ణ‌యం మాత్రం కేంద్ర హోం శాఖ టెక్నిక‌ల్ గా చేసిన సూచ‌న‌ల మేర‌కు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించినప్పుడు, ఈసారి ఎనిమిది విడతల్లో ఎన్నికల నిర్వహణ పెద్ద విషయమేమీ కాదు’’ అని ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. అయితే.. దీనివెనుక రాజ‌కీయ కార‌ణాలు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 8 విడ‌త‌లుగా జ‌రిగితే.. బీజేపీ ప్ర‌చారాన్ని క్షేత్ర‌స్థాయిలోకి తీసుకువెళ్లి.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌చ్చ‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ 8 విడ‌త‌ల వెనుక ఉన్న రాజ‌కీయం.. బీజేపీకి ఏమేర‌కు క‌లిసి వ‌స్తుందో చూడాలి.