విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారంతా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆందోళనలకు మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటించింది కాబట్టే. ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటి కార్యదర్శి కైలాసం పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. తన ప్రకటనలో స్టీలు ప్లాంటు ఏర్పాటుకు జరిగిన ఉద్యమాలు, చేసిన ప్రాణత్యాగాలు లేఖలో ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎక్కడ ఉద్యమాలు మొదలైనా, ఆందోళనలు జరుగుతున్నా వాటిని ప్రభుత్వాలు అణిచివేసేందుకే ప్రయత్నిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. తమ అణిచివేతకు సంఘ విద్రోహులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారని ప్రభుత్వం ముద్ర వేసేస్తుంది. గడచిన మూడున్నర నెలలుగా ఢిల్లీ శివార్లలో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రప్రభుత్వం కూడా ఇలాంటి ముద్ర వేసేసిన విషయాన్ని అందరు చూస్తున్నదే.
రైతుల ఉద్యమంలో టెర్రరిస్టున్నారని, సంఘ విద్రోహులున్నారని, ఖలిస్ధాన్ ఉద్యమకారులున్నారని కేంద్రం+బీజేపీ విపరీతమైన ప్రచారం చేస్తోంది. ఇలాంటి పరిస్దితుల్లో ఉక్కు ఆందోళనలకు నేరుగా మావోయిస్టులు మద్దతు ప్రకటించటమంటే ఆందోళనలకు విఘాతం కలగటమే. ఇప్పటివరకు ఆందోళనల్లో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్షాలు కాంగ్రెస్, వామపక్షాలు కూడా పాల్గొంటున్నాయి. విడిగా టీడీపీ కూడా దీక్షలు చేసింది.
అధికారపార్టీ కూడా ఉంది కాబట్టే పోలీసులు కూడా ఆందోళనల విషయంలో సంయమనం పాటిస్తున్నారు. లేకపోతే ఎప్పుడో లాఠీలు విరిగేవేనటంలో సందేహం లేదు. ఇలాంటి పరిస్దితుల్లోనే మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. రేపు ఏదైనా అల్లర్లు జరిగితే కచ్చితంగా మావోయిస్టుల పనే ముద్రవేసి మొత్తం ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపే ప్రమాదముంది.
ఆందోళనల్లో మావోయిస్టులు లేదా వారి సానుభూతిపరులు చేరిపోయి ఏదైనా అవాంచనీయ ఘటనలకు పాల్పడితే పెద్ద సమస్య తయారవుతుంది. అప్పుడు హోలు మొత్తం ఆందోళనలను పోలీసులు అణిచేసేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఆందోళనకారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మొత్తం ఆందోళనలు నీరుగారిపోతాయనటంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates