అధికారంలో లేనప్పుడు అధినేతలకు ముఖం చూపించేందుకు చాలా మంది ఇష్టపడరు. అదే సమయంలో అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత.. తమను విపరీతంగా అభిమానించే వారిని సైతం పెద్దగా పట్టించుకోని నేతలు కొందరుంటారు. ఇందుకు భిన్నంగా మరికొందరు అధినేతల తీరు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. సీఎం జగన్ కానీ.. తమను అమితంగా అభిమానించే వారు ఎక్కడున్నా సరే.. తామేస్వయంగా వారి దగ్గరకు వెళ్లటం అలవాటు. ఇలాంటి సీన్లు వారి జీవితంలో బాగా ఎక్కువే.
అంతేకాదు.. తమను అభిమానించే వారు తమకు దగ్గరగా రాలేని వేళ.. వారికి సాంత్వన కలిగేలా వారి వద్దకే వెళ్లే తీరు సీఎంజగన్ ప్రత్యేకతగా చెప్పాలి. తాజా ఉదంతం ఈ విషయాన్ని మరోసారి ఫ్రూవ్ చేసిందని చెప్పాలి. విశాఖకు వచ్చిన సీఎం జగన్ ను కలిసేందుకు.. చోడవరం మాజీ ఎమ్మెల్యే (గతంలో మూడుసార్లు గెలిచారు సుమా) గూనూరు ఎర్నినాయుడు (అందరూ మిలటరీ నాయుడుగా పిలుస్తారు) తన కొడుకు వంశీ సాయంతో విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చారు.
ఇక్కడ మిలటరీ నాయుడు గురించి కాస్త చెప్పాలి. టీడీపీలో మూడుసార్లు గెలిచిన ఆయన.. ఎన్టీఆర్ మరణం తర్వాత వైఎస్ బాటలో నడిచేందుకు కాంగ్రెస్ లోకి వచ్చేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. తాను అభిమానించే సీఎం జగన్ ను చూసేందుకు ఆయన విశాఖ ఎయిర్ పోర్టుకు రాగా.. ఆయన్ను సీఎంను కలిసేందుకు భద్రతా సిబ్బంది అనుమతించలేదు. దీంతో.. వీఐపీ లాంజ్ కు కాస్త దూరంలో ప్రయాణికులు వెళ్లే దారిలో వెయిట్ చేస్తున్నారు.
జగన్ కాన్వాయ్ బయలుదేరి.. మిలటరీ నాయుడును దాటి పది అడుగులు వెళ్లిన తర్వాత.. వెళుతున్న కాన్వాయ్ ను ఆపించిన సీఎం జగన్.. కారు దిగి నడుచుకుంటూ మిలటరీ నాయుడు వద్దకువెళ్లారు. అప్యాయంగా పలుకరించి.. ఆరోగ్య విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీంతో.. మిలటరీ నాయుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
సీఎంను కలిస్తే చాలు అనుకున్నవేళ.. ఆయన్ను సెక్యురిటీ సిబ్బంది అనుమతించకపోతే.. సీఎం స్వయంగా దగ్గరకు వచ్చి.. ఆత్మీయ ఆలింగనం చేసుకోవటాన్ని చూసిన పలువురు ఆసక్తికరంగా చర్చించుకున్నారు. తనను అభిమానించే వారి విషయంలో జగన్ ఎంత అలెర్టుగా ఉంటారన్న విషయానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పుకోవటం కనిపించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates