మంత్రి కొడాలి నానికి పంచాయితీ ఎన్నికల డబుల్ షాక్

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా.. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేస్తూ అధికార పార్టీకి తలనొప్పిగా మారిన మంత్రిగా కొడాలి పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఎంత దూకుడు రాజకీయాలైనప్పటికి.. ఒక పద్దతి పాడు లేకుండా అడ్డదిడ్డంగా వ్యాఖ్యలు చేసే నేతల్లో కొడాలి ఒకరుగా నిలుస్తున్నారు. హిందూ దేవాలయాల మీద దాడి జరిగినన సమయంలోనూ.. ఇతర సందర్భాల్లోనూ కొడాలి నాని వ్యాఖ్యలు సంచలనంగానే కాదు వివాదాస్పదంగా మారటం తెలిసిందే.

అలాంటి కొడాలి నానికి తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికలు డబుల్ షాకిచ్చాయి. ఆయన సొంతూరులో టీడీపీ గెలిస్తే.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జనసేన గెలుపొందటం షాకింగ్ గా మారింది. ఫైర్ బ్రాండ్ మంత్రిగానే కాదు.. దూకుడుగా స్టేట్ మెంట్లు ఇవ్వటం.. సీనియర్ నేతల్ని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేసే విషయంలో కొడాలి ముందుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన పంచాయితీ రెండో దశ ఎన్నికల్లో ఆయన సొంతూరు క్రిష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో వైసీపీ బలపర్చిన అభ్యర్థిపై టీడీపీ బలపర్చిన కొల్లూరి అనూష 800 ఓట్ల తేడాతో విజయం సాధించటం సంచలనంగా మారింది.

ఇక.. కొడాలి నాని క్రిష్ణా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గ పరిధిలోని యలమర్రు పామర్రు పరిధిలో జనసేన మద్దతు ఇచ్చిన అభ్యర్థి శేషవేణి 173 ఓట్ల మెజార్టీతో విజయం సాధించటం సంచలనంగా మారింది. ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు.. కొడాలి నానికి మధ్య మాటల యుద్ధం జరగటం తెలిసిందే. మొత్తంగా మంత్రి కొడాలి నానికి తాజా పంచాయితీ ఎన్నికలు డబుల్ షాకిచ్చినట్లుగా చెప్పక తప్పదు.