షర్మిలకు మద్దతిచ్చే వర్గాలు ఉన్నాయా ?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురుగా వైఎస్ షర్మిల తొందరలోనే తెలంగాణాలో రాజకీయపార్టీ పెట్టబోతున్న విషయం దాదాపు స్పష్టమైపోయింది. పరిస్ధితులన్నీ కలిసొస్తే బహుశా వచ్చే మార్చి-ఏప్రిల్ లో పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయి. పార్టీ ఏర్పాటు, విధి విధానాల రూపకల్పన తదితరాల కోసం షర్మిల ఇప్పటికే ఓ న్యాయనిపుణుడితో ఒకరిద్దరు మేధావులతో టచ్ లో ఉన్నారట. సరే వీళ్ళంతా తెరవెనుక పాత్రకే పరిమితమవుతారు కాబట్టి వాళ్ళ పాత్రను ఎంత వేగంగా పూర్తిచేస్తారనేదే కీలకం.

ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే 100 నియొజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర చేయటానికి రంగం రెడీ అవుతున్నట్లు సమాచారం. గతంలో పాదయాత్ర చేసినపుడు షర్మిల తెలంగాణా ప్రాంతాలను టచ్ చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కు తెలంగాణాలో బలమైన మద్దతుదారులున్నారు. వైఎస్ చనిపోయి పదకొండు సంవత్సరాలు అవుతున్నా ఇంకా వైఎస్సార్ అభిమానులుగా, మద్దతుదారులుగా చెలామణి అవుతున్నవారు అన్నీ జిల్లాల్లోను ఉన్నారు.

గ్రౌండ్ లెవల్లోని అన్నీ విషయాలను తెలుసుకున్నాకే తెలంగాణాలో రాజన్న రాజ్యం అంటు షర్మిల రంగంలోకి దిగారు. ఒకప్పటి వైఎస్సార్ మద్దతుదారుల్లో సగంమంది షర్మిల పెట్టబోయే పార్టీలో చేరినా గట్టి ప్రభావం చూపటం ఖాయమనే భావన మొదలైంది. వీళ్ళకు అదనంగా బీసీలు, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్తియన్ మైనారిటీల మద్దతుగా నిలుస్తారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. తమకు సరైన ప్రాతినిధ్యం లేదనే అసంతృప్తి రెడ్లలో బాగా పెరిగిపోయింది.

కొత్తపార్టీ కాస్త ఊపు చూపిందంటే రెడ్లలో బలమైన నేతలు కొందరు షర్మిలతో చేతులు కలిపే అవకాశాలున్నాయి. టీడీపీ నేలమట్టమైపోయిన తర్వాత బీసీలకు సరైన వేదిక లేకపోయింది. తలసాని శ్రీనివాసయాదవ్ లాంటి కొందరు టీఆర్ఎస్ లో మంచి వాయిస్ వినిపిస్తున్నా మెజారిటి బీసీల్లో మాత్రం అసంతృప్తి ఉంది. ఇక ముస్లిం, క్రిస్తియన్ మైనారిటీ నేతల్లో మెజారిటి టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. వీళ్ళు కాంగ్రెస్ లో ఉండలేక, బీజేపీలోకి వెళ్ళలేక అవస్తలు పడుతున్నారు.

ఇటువంటి అనేక మంది నేతలకు షర్మిల కొత్త పార్టీ వేదిక అవుతుందేమో. ఏదేమైనా తొందరలో ప్రారంభమయ్యే పాదయాత్రలో జనాల ఆదరణ ఏ స్ధాయిలో ఉందో క్లారిటి వచ్చేస్తుంది. ఎలాగు సాధారణ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు పార్టీ ఏర్పాటు విషయంలో అంత హడావుడి పడాల్సిన అవసరం కూడా లేదు. అందుకనే జిల్లాల వారీగా వైఎస్సార్ మద్దతుదారులు, అభిమానులతో షర్మిల సమావేశాలు పెట్టుకున్నది. గ్రౌండ్ లెవల్లో ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా నేతల సమావేశం మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని షర్మిలే చెప్పారు. కాబట్టి గుడ్ బిగినింగ్ అనే అనుకోవాలి.